తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

దుర్గమ్మను ఇలా పూజిస్తే తీరని కోరికే ఉండదు! 'ఆయుధ పూజ' వేళ ఏ శ్లోకం పఠించాలి?

దుర్గతులను రూపు మాపే శక్తిస్వరూపిణి- ఆయుధ పూజ రోజు ఈ శ్లోకం పఠిస్తే దుర్గతులు పోయి సద్గతులు ప్రాప్తి.

Navarathri Vijayawada Kanaka Durga Avatharam Day 8
Navarathri Vijayawada Kanaka Durga Avatharam (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 4:02 PM IST

Vijayawada Kanakadurga Avatharam Day 8 : ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిదవ రోజు అమ్మవారు ఏ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు? ఏ శ్లోకం చదువుకోవాలి? ఏ రంగు వస్త్రాన్ని, ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దుర్గాష్టమి
శరన్నవరాత్రులలో ఎనిమిదో రోజు దుర్గాష్టమి. ఆశ్వయుజ అష్టమిని దుర్గాష్టమిగా జరుపుకుంటాం. ఈ రోజు అమ్మవారు శ్రీ దుర్గా దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షస సంహారం చేసిన సందర్భంగా దుర్గాష్టమిని జరుపుకుంటాం. శివుని శక్తి రూపమే "దుర్గ" అని ఆదిశంకరాచార్యుల వారు తెలిపారు. దుర్గాదేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వపాపాలు నాశనమౌతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని వ్యాస మహర్షి రచించిన మత్స్యపురాణం ద్వారా తెలుస్తోంది.

ఈ రోజు దుర్గాదేవి రూపాలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు. దుర్గాష్టమి రోజున విశేషంగా ఆయుధపూజ చేస్తారు.

అందుకే ఆయుధపూజ!
పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మి చెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అర్జునుడు శత్రువులను జయించి విజయుడయ్యాడు. సంవత్సర కాలం పాటు ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు ఆనాటి నుంచి పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేయడం సంప్రదాయంగా మారింది.

ఆయుధ పూజ ఇలా
దుర్గాష్టమి రోజు వృత్తి వ్యాపారాలు చేసే వారు తమ తమ పనిముట్లను, తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని పాటించడం ద్వారా తాము చేసే వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయని విశ్వాసం.

శ్లోకం

  • "సర్వ స్వరూపే సర్వేశి సర్వలోక నమస్కృతే!
  • భయే భస్త్రాహి నోదేవి దుర్గాదేవి నమోస్తుతే" అంటూ ఆ దుర్గాదేవిని స్తుతిస్తే దుర్గతులు తొలగిపోతాయి. సద్గతులు కలుగుతాయి.

ఏ రంగు వస్త్రం? ఏ పూలు?
త్రిశూల ధారియై సింహవాహనాన్ని అధిష్టించిన దుర్గాదేవికి ఈరోజు ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. ఎర్ర గులాబీలతో అమ్మను పూజించాలి.

ప్రసాదం

  • ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర సమర్పించాలి.
  • ఆ దుర్గాదేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక!

శ్రీ మాత్రే నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details