CM Revanth Reddy ON Telangana Formation Day :తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవనం కీలక అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలో మాట్లాడారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజన చేస్తున్నామని, హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణ, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని సబ్ అర్బన్, రీజినల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు గ్రామీణ తెలంగాణ జోన్‌గా విభజిస్తున్నట్లు వెల్లడించారు. మూడు జోన్లలో అభివృద్ధి ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు, .
రాష్ట్ర ప్రజల స్వేచ్ఛపై దాడి జరిగిందని, సామాజిక న్యాయం మేడిపండు చందమైందని అన్నారు. ప్రజల సంపద గుప్పెడు మంది చేతుల్లోకి వెళ్లిందని, తెలంగాణ సంసృతి, సంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం ఎన్నికైన ప్రభుత్వం తెలంగాణలో ఉందన్న ఆయన ప్రజా ప్రభుత్వం జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవమని అన్నారు.
'తెలంగాణ ప్రదాత సోనియా గాంధీని ఈ ఉత్సవాలకు మంత్రివర్గం ఆహ్వానించింది. ఏ హోదాలో సోనియాగాంధీని ఆహ్వానించారని కొందరు అడుగుతున్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? తల్లిని ఆహ్వానించేందుకు బిడ్డకు ఒకరి అనుమతి అవసరమా? ఏ హోదాలో, ఏ పదవిలో ఉన్నారని మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తించుకున్నాం? తెలంగాణ చరిత్ర ఉన్నంతవరకూ ఈ సమాజం సోనియాను తల్లిగానే గౌరవిస్తుంది. తెలంగాణ గడ్డతో సోనియాగాంధీది రాజకీయ బంధం కాదు. తెలంగాణతో సోనియాగాంధీకి ఉన్నది పేగు బంధం' అని రేవంత్ రెడ్డి అన్నారు.
అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గేయంగా : తెలంగాణ వచ్చి పదేళ్లయినా రాష్ట్ర గీతం లేదని, ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఉండాలని అంతా అనుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారికంగా గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమయ్యి ఉండేది చిహ్నంలోనే అని తెలిపారు.
"తెలంగాణ అంటేనే ధిక్కారం, తెలంగాణ అంటనే పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో ధిక్కారం, పోరాటం ప్రతిబింబించాలి. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందిస్తున్నాం. ప్రజల ఆకాంక్షల మేరకు టీఎస్‌ను టీజీగా మార్చాం. సగటు గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం."- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి