Nallamilli Ramakrishna Reddy Assembly Seat Issue :నిజం గెలవాలి యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీయే కూటమి (NDA Alliance) ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కొనసాగించాలంటూ వినతి పత్రం అందజేశారు. మొదటి జాబితాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించినా బీజేపీ కూటమిలో కలిశాక అనపర్తి సీటు బీజేపీకు కేటాయిస్తారంటూ వార్తలు రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో నారా భువనేశ్వరి సానుకూలంగా స్పందించారు. రాజకీయంగా తాను జోక్యం చేసుకోనని, కానీ అనపర్తి సీటు విషయమై అధిష్ఠానంతో మాట్లాడతానని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు.
నల్లమిల్లి అనపర్తి సీట్ ఇవ్వాలని డిమాండ్ : అనపర్తి అసెంబ్లీ సీటును నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే కేటాయించాలని ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గత రెండు రోజులుగా నిరసన దీక్ష చేపట్టారు. సోమవారం దివాన్‌చెరువులో జోన్-2 పార్టీ పరిశీలకుడు సుజయ్‌కృష్ణ రంగారావును కలిసి తమ రాజీనామా పత్రాలు అందించారు. గత 40 సంవత్సరాలుగా టీడీపీతోనే ఉన్న నల్లమిల్లి కుటుంబానికి టికెట్ ఇస్తే అసెంబ్లీ సెగ్మెంట్‌తో పాటు పార్లమెంట్ స్థానానికి కూడా మంచి మెజారిటీ వచ్చే విధంగా కృషి చేస్తామని వివరించారు. ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ అరాచక, అవినీతి పాలనపై టీడీపీ శ్రేణులతో కలిసి రామకృష్ణారెడ్డి అనేక పోరాటాలు చేశారని ఆయనకే సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. కూటమి అభ్యర్థిగా తొలి జాబితాలోనే పేరు ప్రకటించి తాజాగా పొత్తుల్లో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించినట్లు వివిధ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.