CM Chandrababu and Nara Lokesh Cast Their MLC Votes:రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో 2 పట్టభద్రుల స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటేసేందుకు ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఏర్పాట్లు, ప్రక్రియను పరిశీలిస్తున్నారు.
ఓటేసిన చంద్రబాబు, లోకేశ్: ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా సాగుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ నిలబడ్డారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చంద్రబాబు, లోకేశ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అందరినీ ఆప్యాయంగా పలకరించిన సీఎం:ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఓటేసి బయటకొచ్చిన చంద్రబాబు, లోకేశ్‌ని కలిసేందుకు జనం ఇళ్లలోంచి పెద్దఎత్తున బయటకు వచ్చారు. ఆందరినీ ఆప్యాయంగా పలకరించిన సీఎం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు, చిన్నారుల కోరిక మేరకు వారితో ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఓ చిన్నారిని సీఎం ఎత్తుకుని ఫొటో దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే గొల్లపూడిలో మాజీమంత్రి దేవినేని ఉమ, నందిగామలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.