Chandrababu Naidu Teleconference With TDP Leaders :రాష్ట్ర పునర్ నిర్మాణం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తు అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే మూడు పార్టీలు మళ్లీ చేతులు కలిపాయని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం కోసమే కాదని, రాష్ట్రాన్ని గెలిపించడం కోసమని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బూత్ లెవల్ కార్యకర్తలు, నాయకులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Chandrababu About TDP, BJP, Janasena Alliance :రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం మూడు పార్టీలు చేతులు కలిపాయని, కింది స్థాయిలో నేతలు, కార్యకర్తలు కూడా కలిసి పని చేయాలని చంద్రబాబు సూచించారు. విభేదాలను పక్కన పెట్టి గెలుపు ఒక్కటే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ, ప్రతి సీటూ ముఖ్యమేనని పేర్కొన్నారు. వాడవాడలా మూడు జెండాలు కలిసి సాగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశాడని నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్ పాలనలో నష్టపోయిన రాష్ట్రంపై బాధ్యతతో దుష్ట పాలనను అంతం చేయడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు. మళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే కేంద్ర సహకారం అవసరమని తెలిపారు.