తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 7:20 AM IST

Updated : Aug 17, 2024, 8:24 AM IST

ETV Bharat / politics

పార్టీకి పూర్వవైభవం తేవడంపై బీఆర్​ఎస్ ఫోకస్ - త్వరలోనే ఆ ప్రాంతీయ పార్టీల విధానాల అధ్యయనం! - BRS about Party Strengthening

BRS on other Regional Parties : సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యే దిశగా గులాబీదళం ప్రణాళికలు రచిస్తోంది. దేశంలో పటిష్ఠంగా ఉన్న ప్రాంతీయ పార్టీల విధానాలను అధ్యయనం చేయనుంది. డీఎంకే, టీఎంసీ, బీజేడీ లాంటి పార్టీల విధానాలను పరిశీలించి, సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని బీఆర్​ఎస్​ భావిస్తోంది. ఇందుకోసం వచ్చే నెలలో కేటీఆర్ నేతృత్వంలో పార్టీ బృందం తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో పర్యటించనుంది.

BRS to Study other Regional Parties for Strengthen Party
BRS on other Regional Parties (ETV Bharat)

BRS to Study other Regional Parties for Strengthen Party :పదేళ్లు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్ఠం చేసేందుకు సిద్ధమవుతోంది. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్న భావన శ్రేణుల్లో ఎప్పట్నుంచో ఉంది. 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా కొనసాగుతూ వచ్చింది. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చింది. తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది.

ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయి, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అయితే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, ఇతర ప్రాంతీయ పార్టీల విధానాలను అధ్యయనం చేయాలని గతంలో భావించగా, అది ముందుకు సాగలేదు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పలువురు పార్టీ సంస్థాగత బలోపేతం గురించి ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్ఠం చేసుకోవాలన్న ఆలోచనలో అధినాయకత్వం ఉంది.

సంస్థాగతంగా బలోపేతంపై ప్రణాళికలు :పార్టీ సంస్థాగత నిర్మాణం దిశగా ఇప్పటికే పలువురు నేతలతో అధినేత కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బీఆర్​ఎస్​ ప్రస్థానం రెండు దశాబ్దాలకు పైగా గడిచింది. మరికొన్ని దశాబ్దాల పాటు పార్టీని పటిష్ఠంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో నాయకత్వం ఉంది. ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు అన్ని జిల్లాల్లోనూ పార్టీకి కార్యాలయాలు ఉన్నాయి. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుని పటిష్ఠం చేయాలని భావిస్తున్నారు. తమిళనాడులో డీఎంకే, పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ, ఒడిశాలో బీజేడీ వంటి పార్టీలను అధ్యయనం చేయనున్నారు.

ఇప్పటికే తమిళనాడులో డీఎంకే నేతలతో సమావేశమయ్యారు. డీఎంకే నేత సురేశ్​ శుక్రవారం హైదరాబాద్‌లో బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిశారు. వచ్చే నెలలో కేటీఆర్ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లి డీఎంకే విధానాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం, వైసీపీకి చెందిన పలు అంశాలనూ పరిగణలోకి తీసుకుంటామని అంటున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణ, ప్రజల్లో మమేకమయ్యే తీరు, ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు సహా ఇతర అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని నేతలు భావిస్తున్నారు.

సంస్థాగత కమిటీల ఏర్పాటు : అన్నింటిని పరిశీలించి ఉత్తమ విధానాలను తీసుకుని పార్టీని పటిష్ఠం చేస్తామని అంటున్నారు. తెలంగాణ ప్రజలు, ప్రయోజనాల కోసం మరికొన్ని దశాబ్దాల పాటు పార్టీ నిలబడేలా పటిష్ఠంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిన గులాబీ పార్టీకి సరికొత్త రూపు ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా తగిన చర్యలు ఉంటాయని, అధ్యయనం తర్వాత సంస్థాగత కమిటీల ఏర్పాటు ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

'సెప్టెంబర్​లో మా పార్టీ సీనియర్​ నాయకులతో కలిసి ప్రాంతీయ పార్టీల విధానాలను అధ్యయనం చేయనున్నాం. డీఎంకే ఇతర ప్రాంతీయ పార్టీలను అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తా. నాతో పాటు సీనియర్​ నాయకులు, మాజీ మంత్రులు కొన్ని ప్రాంతీయ పార్టీల రాష్ట్రాలకు వెళ్దామని అనుకుంటున్నాం. డీఎంకే, టీఎంసీ, బీజేడీ లాంటి పార్టీల విధానాలను అధ్యయనం చేయాలనుకుంటున్నాం' - కేటీఆర్, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించిన కేటీఆర్

బస్సుల్లో అల్లికలే కాదు, బ్రేక్ డ్యాన్సులు కూడా వేసుకోవచ్చు: మంత్రి సీతక్కకు కేటీఆర్ కౌంటర్ - KTR VS SEETHAKKA

Last Updated : Aug 17, 2024, 8:24 AM IST

ABOUT THE AUTHOR

...view details