BJP Focus on Graduate MLC by Election : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బరిలో దిగిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నెల 27న పోలింగ్ ఉండటంతో మూడు ప్రధాన పార్టీలు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. బీజేపీ అభ్యర్థిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని బరిలో దింపింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో కమలదండు ప్రేమేందర్ రెడ్డి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తోంది. ఉప ఎన్నికకు సంబంధించి పట్టభద్రుల ఓటు నమోదు నుంచే ప్రత్యేక దృష్టి పెట్టింది.
BJP on Congress Government Mistakes: పట్టభద్రుల ఉప ఎన్నికను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ ముఖ్య నేతలు సైతం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తూ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
BJP Campaign in Villages in Telangana: అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ మంచి ఓట్లు, సీట్లు సాధించిన కాషాయదళం, అదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ పని చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మోదీ వేవ్ బాగా కలిసి వచ్చిందని, ఇదే వేవ్‌ను పట్టభద్రుల ఉప ఎన్నికలోనూ అందిపుచ్చుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పట్టణ ప్రాంతానికే పరిమితమైన బీజేపీ, లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఓటింగ్ సరళిని చూస్తే కొన్నిచోట్ల పల్లెల్లోనూ నిశ్శబ్దంగా కమలం గుర్తుకు ఎక్కువ ఓట్లు పడినట్లు సమాచారం. గ్రామీణ ప్రజలకు సైతం బీజేపీ చేరువైందని, పట్టభద్రులు తమను విశ్వసిస్తారని నేతలు భావిస్తున్నారు.