Andhra Pradesh Vote on Account Budget 2024-25: అంబేడ్కర్ ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో పేర్కొన్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. 2024 - 25 ఆర్ధిక సంవత్సరానికి 2 లక్షల 86 వేల 389 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్‌ను సభలో మంత్రి ప్రవేశపెట్టారు.
మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం 2 లక్షల 30 వేల 110 కోట్ల రూపాయలు . మూలధన వ్యయం 30 వేల 530 కోట్ల రూపాయలు బుగ్గన ప్రతిపాదించారు. 24 వేల 758 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు, 55 వేల 817 కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉంటుందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దవ్యలోటు 3.51 శాతం ఉంటుందని, రెవెన్యూ రాబడి 2 లక్షల 5 వేల 352 కోట్లు వస్తుందని మంత్రి అంచనా వేశారు.
కేంద్ర పన్నుల ద్వారా 49 వేల 286 కోట్లు, రాష్ట్ర పన్నుల ద్వారా లక్షా 9 వేల 538 కోట్లు వస్తుందని, పన్నేతర ఆదాయం 14 వేల 400 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 32 వేల 127 కోట్లు వస్తుందని ఆర్థికమంత్రి అంచనా వేశారు. బహిరంగ మార్కెట్‌లో 71 వేల కోట్లు, కేంద్రం నుంచి 61 వేల 642 కోట్లు, ఇతర మార్గాల్లో 25 వేల కోట్ల రూపాయల రుణాలు సేకరించాలని సర్కార్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.