Prathidwani : జగన్ ఎన్నికలకు ముందు నవరత్నాల పేరుతో ప్రజలను ఊరించారు. ఆ 9 పథకాలతో కోట్లాదిమంది జీవితాల్లో వెలుగులు తెస్తానన్నారు. జనం నమ్మారు. అధికారం ఇచ్చారు. మరి ప్రజల జీవితాలు బాగుపడ్డాయా? పేదరికాన్ని పారద్రోలారా? గృహిణులను లక్షాధికారులను చేశారా? పాత ఇంటికి సున్నాలు వేసినట్టు, పాత బోర్డుకు రంగులు అద్దినట్టు ఇందులో గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఎన్ని ఉన్నాయి? ఏఏ పథకాలకు జగన్ పేరు మార్చారు? నవరత్నాల పేరుతో చేసింది నయవంచన కాదా? జగన్ సీఎం అవకముందు లేనివి, కొత్తగా ప్రజలకు ఇచ్చినవి ఏవి? నవరత్నాల లోగుట్టు ఏంటి?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంలో నవరత్నాల హామీలు కీలక పాత్ర పోషించాయి. మద్య నిషేధం నుంచి ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వరకు నెత్తిన చేయి పెట్టి నాదీ హామీ అంటూ సీఎం జగన్ తీయని మాటలు చెప్పి అయిదేళ్లు గడిచిపోయాయి. అసలు జగన్ చెప్పిన ఆ నవరత్నాలు ఏంటి? వాటిల్లో పేర్లు మార్చిన పథకాలు ఎన్ని? నవరత్నాల వెనుక ఉన్న నవమోసాల మాటేంటి? జలయజ్ఞమేది? మద్య నిషేధం ఏది? జగన్ మాటలు నమ్మి, ఆశపడి ఓట్లేసిన ప్రజల పరిస్థితేంటి?
మాట తప్పను మడమ తిప్పను, విశ్వసనీయతకు చిరునామా, చిన్న పిల్లలకు మేనమామ అంటూ జగన్ తన అరచేతి వైకుంఠంలో చూపించింది నవరత్నాలనా? రంగురాళ్లనా? ఆ నినాదం వెనుక ఉన్న అసలు రంగేంటి? ముఖ్యమంత్రి చెప్పింది ఒకటి చేస్తుంది మరొకటి. మద్యపానం నిషేధం లేదు, మద్యం నియంత్రణ లేదు. మద్యం నిషేధం చేయకపోవడంతో పేద ప్రజలు నష్టపోతున్నారు. ఈ విషయంలో అసలు జగన్ ఏం చెప్పారు, ఏం చేశారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం. దీనిపై చర్చించేందుకు సామాజిక కార్తకర్త షేక్ సిద్ధిఖ్, రాజకీయ విశ్లేషకులు వినీల పాల్గొన్నారు.
మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశామంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 'ప్రకాశించని నవరత్నాలు - జగన్ మోసపు లీలలు' పేరిట టీడీపీ వాస్తవపత్రం అంటూ గతంలో ఓ పుస్తకం సైతం విడుదల చేసింది. రైతు భరోసా కింద 13 వేల 500 రూపాయల పెట్టుబడి సాయం కింద ఇస్తానని చెప్పిన జగన్, ఇచ్చేది కేవలం రూ.7వేల 500 మాత్రమేనని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. రైతు భరోసా కింద 12 హామీలు ఇస్తే, ఒక్కటీ అమలు చేయలేదని, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఇచ్చిన 8 హామీల్లో 8 అమలు కాలేదని తెలిపారు.