CURRY LEAVES CHICKEN : చికెన్ ఫ్రై, చికెన్ షోర్వా, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ 65 చెప్పుకొంటూ పోతే చికెన్‌తో చేయని వెరైటీ లేదు. వారానికి రెండు మూడు సార్లు చికెన్ ఆరగించాల్సిందే. చికెన్ కర్రీల్లో ఎన్నో వెరైటీలు ఉన్నా ఎప్పుడూ కొత్తగా తినాలనిపిస్తుంది. అందుకే మనవాళ్లు చికెన్ పై చేసిన ప్రయోగాలు మరే ఇతర మాంసాహార వంటకాలపైనా చేసి ఉండరు. తాజాగా మరో కొత్త వంటకంతో మీ ముందుకొచ్చాం. అదే కరివేపాకు చికెన్. అస్సలు కరివేపాకు చికెన్ రుచి అక్కడక్కడా మనకు బిర్యానీల్లో కనిపిస్తుంది. కానీ, పూర్తిగా కరివేపాకు చికెన్ ఎలా ఉంటుందో ఓ సారి ఇలాంటి కొలతల్లో, ఈ పద్ధతిలో తయారు చేసుకుని ఆరగించండి.
మాంసాహారం మంచిదా? చెడ్డదా? - వారంలో ఎన్నిసార్లు నాన్ వెజ్ తినొచ్చో తెలుసా?
కరివేపాకు చికెన్ తయారీ కోసం కావలసిన పదార్థాలు :
- చికెన్ - కిలో
- కరివేపాకులు
- టొమాటోలు - 2
- పచ్చిమిరపకాయలు - 4
- ఉల్లిపాయలు - 2
- ధనియాలు - 2 టేబుల్స్పూన్లు
- జీలకర్ర - 1 1 / 2 టీస్పూన్
- సోంపు గింజలు - 1 1 / 2 టీస్పూన్
- దాల్చిన చెక్క
- యాలకులు - 3
- మిరియాలు - 2 టీస్పూన్లు
- ఎండుమిరపకాయలు - 7
- నూనె - 3 టేబుల్స్పూన్లు
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్టు - 3 టీస్పూన్లు
- పసుపు - 1 టీస్పూన్
- ఉప్పు
మీరు తెస్తున్న చికెన్ మంచిదేనా? - తాజా, కల్తీ మాంసం ఎలా గుర్తించాలంటే!
తయారీ విధానం :
- కరివేపాకు చికెన్ కోసం ముందుగా కరివేపాకుల పొడి అవసరం. తాజా కరివేపాకు తెచ్చుకుని ప్యాన్లో వేసి పొడిగా, కాస్త దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- అదే ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, సోంపుగింజలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వాటిని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.
- దోరగా వేయించిన కరివేపాకుతో సహా మసాలా దినుసులన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీలో మెత్తటి పొడిలా పట్టించి పక్కన పెట్టుకోవాలి.
- ఇపుడు చికెన్ కర్రీ కోసం ఒక వెడల్పాటి కడాయిలో నూనె పోసుకుని వేడియ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి.
- ఆవాలు చిటపటలాడిన తరువాత తరిగిన ఉల్లిపాయలు, చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి.
- ఉల్లిపాయ ముక్కలు కొంచె గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని కలుపుకోవాలి. కొద్ది సేపటికే టొమాటో ముక్కలు (తరుగు) కూడా వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసి కలిపిన 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన కిలో చికెన్ ముక్కలని కడాయిలో వేసి కలపాలి.
- మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించిన తరువాత కడాయికి మూత పెట్టి కనీసం ఐదు నిమిషాలు ఉడికించాలి.
- ఐదు నిమిషాల తరువాత సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న మసాలా కరివేపాకు పొడిని వేస్తూ చికెన్లో నీళ్లు మొత్తం పూర్తిగా ఇంకిపోయే వరకూ వేయించాలి.
- కరివేపాకు పొడి రెండు మూడు సార్లు వేసిన తరువాత చికెన్ బాగా పొడిగా తయారవుతుంది. చివరగా కొన్ని తాజా కరివేపాకులు కూడా వేసుకుని కలపాలి. అంతే! అప్పటికే మీ ఇంట్లో చికెన్ కర్రీ వాసన ఘుమఘుమలాడుతుంది.
మీరు ఏ స్టైల్లో వండుతున్నారు - తేడా వస్తే అనారోగ్యం పొంచి ఉందట!
నాటు కోడి పులుసు ఇలా చేయండి - ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!