How to Make Dhaba Style Aloo Bhuna Recipe :చాలా మంది ఫేవరెట్ డిష్‌లలో ఆలూ ఒకటి. దీంతో ఎన్ని రకాల వెరైటీలు చేసినా ఇష్టంగా తినేస్తారు. ఇక పిల్లలైతే దీనితో చేసిన వంటకాలను ఎంతో ఇష్టంగా.. ఒక మెతుకు మిగల్చకుండా తినేస్తారు. అయితే.. ఇప్పటి వరకు మీరు బంగాళదుంపలతో ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేసి ఉంటారు. కానీ.. ఈ సారి సరికొత్త రుచిలో ఈ వెరైటీ రెసిపీని ట్రై చేయండి. అదే "ఆలూ భునా మసాలా". టేస్ట్ చాలా బాగుంటుంది. స్పైసీగా జ్యూసీగా అద్భుతంగా ఉంటుంది. మరి, ఈ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
గ్రేవీ కోసం:
- నూనె - 1/3 కప్పు
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఉల్లిపాయలు - 2
- దంచిన వెల్లుల్లి - 6
- దంచిన అల్లం - కొద్దిగా
- పచ్చిమిర్చి - 6
- వేయించిన జీలకర్ర పొడి - 1 టీ స్పూన్
- కశ్మీరీ కారం - 1 టీ స్పూన్
- ధనియాల పొడి - 2 టీ స్పూన్లు
- పసుపు - పావు టీ స్పూన్
- కారం - 1 టీ స్పూన్
- పెరుగు - 4 టేబుల్ స్పూన్లు
- టమాటలు - 2
- ఉప్పు - రుచికి సరిపడా
- వాటర్ - 1 కప్పు
- కొత్తిమీర - కొద్దిగా
కర్రీ కోసం:
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 2
- క్యాప్సికం - 1
- బంగాళదుంపలు - 4
- కసూరీ మేథీ - కొద్దిగా
- గరం మసాలా - 1 టీ స్పూన్
- ఉప్పు - అర టీ స్పూన్
తయారీ విధానం:
- ముందుగా బంగాళదుంపలను ఉడికించి.. చల్లారిన తర్వాత పొట్టు తీసి నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. అలాగే గ్రేవీ కోసం ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి.. కర్రీ కోసం ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికం గింజలు తీసేసి పొడుగ్గా కట్ చేసుకోవాలి. టమాటలను ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. కాగిన తర్వాత జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి.
- వేగిన తర్వాత సన్నని ఉల్లిపాయ తరుగు వేసి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- రంగు మారిన తర్వాత దంచిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం వేయించిన జీలకర్ర పొడి, కశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, పసుపు, కారం వేసి మసాలాలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి.
- మాసాలాలు మగ్గిన తర్వాత మంటను సిమ్‌లో పెట్టి పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టమాట పేస్ట్ వేసి కలపాలి. అనంతరం రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి నూనె పైకి తేలేంతవరకు సిమ్‌లో పెట్టే ఉడికించుకోవాలి.
- ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మరో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి.
- ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆతర్వాత బంగాళదుంప ముక్కలు, కసూరీ మేథీ, గరం మసాలా, అర టీ స్పూన్ ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు టాస్ చేయాలి. ఇంతకుముందే గ్రేవీలో ఉప్పు వేశాం కాబట్టి ఇక్కడ ఎక్కువ మొత్తంలో వేయాల్సిన అవసరం లేదు. ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి.
- ఈ లోపు గ్రేవీలో ఆయిల్ పైకి తేలుతుంటుంది. అప్పుడు ఓ కప్పు నీరు పోసి కలిపి మూత పెట్టి మరోసారి ఉడికించుకోవాలి.
- గ్రేవీ మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి టాస్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసి ఓ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిగిలిన కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే ఆలూ భునా మసాలా రెడీ. అన్నం, పరాట, చపాతీ.. ఇలా ఎందులోకైనా కిర్రాక్‌గా ఉంటుంది.
వారెవ్వా అనిపించే "చెట్టినాడు ఆలూ ఫ్రై" - మసాలా నషాళానికి అంటాల్సిందే!
లంచ్ బాక్స్ స్పెషల్ - యమ్మీ యమ్మీ "ఆలూ రైస్" - ఇలా చేస్తే పిల్లలు అస్సలు వద్దనకుండా తినేస్తారు!
ఎన్నిసార్లు చేసినా "ఆలూ ఫ్రై" క్రిస్పీగా రావడం లేదా? - ఓసారి ఇలా ట్రై చేస్తే క్రిస్పీతో పాటు సూపర్ టేస్ట్!