Char Dham Yatra 2025 :ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ముగిసింది. ఆ తర్వాత అంతటి ప్రాముఖ్యం కలిగిన చార్ధామ్ యాత్ర త్వరలోనే ప్రారంభం కానుంది. ఎత్తైన కొండలు, పర్వతాలు, నదులను దాటుతూ సాగే యాత్రను పవిత్రంగా భావిస్తుంటారు భక్తులు. ఈ నేపథ్యంలోనే చార్ధామ్ యాత్ర అంటే ఏంటి? ఇందులో ఏ ఏ క్షేత్రాలు ఉంటాయి? యాత్ర ఎప్పుడు ప్రారంభం కానుంది? సమీపంలోని దర్శనీయ ప్రదేశాలు ఏంటి? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చార్ధామ్ యాత్ర అంటే ఏంటి?
ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లను కలిపి చార్ధామ్ యాత్రగా పిలుస్తుంటారు. ఈ యాత్రలో భాగంగా ఈ నాలుగు పుణ్య క్షేత్రాలను భక్తులు దర్శించుకుంటారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొని ఆధ్యాత్మిక లోకంలో మునిగిపోతుంటారు.
యాత్ర ఎప్పుడు ప్రారంభం కానుంది?
చార్ధామ్ యాత్ర తేదీలను ప్రతి ఏటా మహా శివరాత్రిని పురస్కరించుకుని ప్రకటిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేదార్నాథ్ ఆలయాన్ని మే 2 ఉదయం 7గంటలకు తెరవనున్నట్లు బుధవారం ప్రకటించారు. బద్రీనాథ్ ఆలయాన్ని మే 4న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ సీఈఓ విజయ్ ప్రసాద్ తపిల్యాల్ వెల్లడించారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయను పురస్కరించుకుని ఏప్రిల్ 30న తెరుచుకోనున్నట్లు వివరించారు.
యమునోత్రి ధామ్ : చార్ధామ్ యాత్రలో సందర్శించే తొలి పుణ్య క్షేత్రం యమునోత్రి. ఇది యుమునా నదికి 3,293 అడుగుల ఎత్తులో ఉంటుంది.
దర్శనీయ ప్రదేశాలు : రైతాల్, బార్సు, ఉత్తరకాశీ, హనుమాన్ ఛట్టీ, జానకీ చట్టీ, ఖర్సాలీ, బర్కోట్, డయారా బుగ్యాల్,
గంగోత్రి ధామ్ : చార్ధామ్ యాత్రలో రెండో పుణ్య క్షేత్రం గంగోత్రి ధామ్. ఇది గంగా నదికి 3,100 అడుగుల ఎత్తులో ఉంటుంది.
దర్శనీయ ప్రదేశాలు : భగీరథీ కొండ, దోడి తల్, కేధార్ తల్, గంగోత్రి ఆలయం, గంగోత్రి నేషనల్ పార్క్, గోముఖ్ తపోవన్ ట్రెక్, కేధార్ తల్ ట్రెక్
కేదార్నాథ్ ధామ్ : దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయం 3,583 అడుగుల ఎత్తులో ఉంటుంది