US Attack On Houthis :పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య ప్రారంభమైన పోరు క్రమంగా విస్తరిస్తోంది. రోజుకో దాడి, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. శనివారం హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై క్షిపణులు ప్రయోగించగా, అమెరికా ప్రతీకార దాడులు చేసింది. యెమెన్ రాజధానిలోని హౌతీల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు అగ్రరాజ్యం పేర్కొంది.
"హౌతీల కార్యకలపాలు దెబ్బతినేలా దాడులు నిర్వహించాం. ఎర్ర సముద్రం, బాబ్ అల్ మాండెబ్, ఏడెన్ గల్ఫ్‌లో వ్యాపార నౌకలపై దాడులు చేశాం. హౌతీ రెబల్స్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే దీని లక్ష్యం" అని అమెరికా మిలిటరీ అధికారులు తెలిపారు.
యెమెన్‌పై ఇజ్రాయెల్ ఎటాక్
మరోవైపు గత గురువారం యెమెన్‌పై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడులు హౌతీల సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని జరిపినట్లు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నారు. దీనికి ప్రతీకారంగా హౌతీ రెబల్స్ శనివారం ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై ప్రొజక్టైల్ క్షిపణులను ప్రయోగించారు. అయితే వీటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ సైన్యం విఫలమైంది. ఫలితంగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోవడంపై టెల్‌అవీవ్ విచారణకు ఆదేశించింది. టెల్‌అవీవ్‌పై హౌతీలు దాడులు చేసిన కొన్ని గంటల్లోనే, ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా ప్రతీకార దాడులు చేయడం గమనార్హం.
గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. వీరికి ఇరాన్ మద్దతిస్తూ వస్తోంది. తాము పాలస్తీనియన్లకు సంఘీభావంగా వ్యవహరిస్తున్నామని హౌతీ తిరుగుబాటుదారులు పేర్కొంటున్నారు. గాజాపై యుద్ధాన్ని ఆపే వరకు ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తామని వారు చెబుతున్నారు. దీంతో హౌతీల సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు దాడులు చేస్తున్నాయి.
సొంత యుద్ధవిమానంపైనే కాల్పులు!
కాగా, ఎర్ర సముద్రంలోని పెట్రోలింగ్ ఏరియాలో ఓ అమెరికా యుద్ధ విమానం పొరపాటున, తమ దేశానికే చెందిన మరో మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌పై కాల్పులు జరిపి, దానిని పడగొట్టింది. 'యూఎస్ మిలటరీకి చెందిన గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్ ఎయిర్‌క్రాఫ్ట్ - F/A-18 ఎయిర్‌క్రాఫ్ట్‌పై పొరపాటున కాల్పులు జరిపింది. దీనితో సదరు F/A-18 కూలిపోయింది. అయితే అందులోని ఇద్దరు పైలట్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు' అని యూఎస్ మిలటరీ తెలిపింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు పేర్కొంది.