Russia Ukraine War Modi News :ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి పాల్పడితే ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై అగ్రరాజ్యం అమెరికా 2022లోనే పూర్తి సథాయి కసరత్తు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కార్యవర్గానికి చెందిన ఇద్దరు అధికారులు ఓ ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు. అయితే ఈ క్రమంలో అణుసంక్షోభ నివారణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు చైనా అధినేత చేసిన ప్రకటనలు లేదా అందించిన సహకారం ముఖ్యపాత్ర పోషించాయని సదరు నివేదిక పేర్కొంది.
పుస్తకంలో ప్రస్తావన
వాస్తవానికి మాస్కో టాక్టికల్ అణుబాంబును ప్రయోగించే అవకాశాలున్నాయని వాషింగ్టన్ బలంగా విశ్వసించింది. ఈ విషయాన్ని జిమ్‌స్కాటో అనే జర్నలిస్టు తన పుస్తకం 'ది రిటర్న్ ఆఫ్ గ్రేట్ పవర్'లో ప్రస్తావించారు. ముఖ్యంగా కొన్ని అంచనాలు, సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత వాషింగ్టన్ ఈ నిర్ణయానికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
పుతిన్ ప్లాన్
ఖేర్సాన్‌లో రష్యా ఎదురు దెబ్బలు తింటున్న వేళ అణుదాడి జరగవచ్చని వాషింగ్టన్ భావించింది. ఈ ప్రాంతాన్ని తమ భూభాగంలోనిదిగా అప్పటికే మాస్కో ప్రకటించడం వల్ల పుతిన్ ఈ దాడికి పచ్చజెండా ఊపవచ్చనుకున్నారు. ఆ సమయంలో తమ దాడికి అవసరమైన సాకు కూడా దానికి దొరికినట్లు భావించారు. దీనికి తగ్గట్లే ఉక్రెయిన్ డర్టీబాంబ్ కోసం యత్నిస్తోందని క్రెమ్లిన్ వర్గాలు తరచూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టాయి.