Ayurveda Experts Tips to Get Rid of Tobacco Addiction: WHO లెక్కల ప్రకారం.. ప్రతీ సంవత్సరం 8 మిలియన్లకు పైగా జనం పొగాకు వాడకంతో మరణిస్తున్నారు. ఈ కారణంగానే పొగాకును మానుకోవాలని చెప్పేందుకు ప్రతి ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని(World No Tobacco Day) నిర్వహిస్తున్నారు. అయితే.. ఒక్కసారి పొగాకు బానిసలైన తర్వాత ఆ అలవాటును మానుకోవడం కొంచెం కష్టమైన వ్యవహారమే. అయితే.. ఆయుర్వేద పద్ధతులు ఫాలో అయితే పొగాకు వ్యసనానికి స్వస్తి పలకొచ్చని నిపుణులు అంటున్నారు. ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
వ్యాయామం:పొగాకు అలవాటును మానుకోవడానికి ముందుగా జీవనశైలిలో పలు మార్పులు చేయాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగానే ప్రతి రోజూ ధ్యానం, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. రెగ్యులర్ వ్యాయామం, తగినంత విశ్రాంతి, ధ్యానం వంటివి ఒత్తిడి, ఆందోళనలు తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయని అంటున్నారు. రోజుకు 15 నిమిషాల ధ్యానం, రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మైండ్, బాడీ రిలాక్స్‌గా ఉంటుందని తద్వారా పొగాకు తిన్నాలన్న కోరిక తగ్గుతుందని అంటున్నారు.
యువకులు స్మోకింగ్‌కు ఎందుకు అలవాటు పడతారు? - దాన్ని ఎలా అడ్డుకోవాలి? - Causes of Nicotine Addiction
ఆహారాలు:పొగాకు వ్యసనం మానడం కోసం ఆయుర్వేద ప్రకారం తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ల వంటి పోషకమైన ఆహారాలను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇవి తినడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్, పునరుజ్జీవన ప్రక్రియలకు మద్దతు ఇస్తుందని అంటున్నారు. అలాగే మసాలా, అధిక నూనె, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగాన్ని తగ్గించాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది. ఎందుకంటే.. ఇవి పొగాకు తినాలన్న కోరికను పెంచుతాయని, శరీర విధులను నియంత్రించే దోషాలను అసమతుల్యత చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడూ ఆరోగ్యానికి మంచి చేసే ఆహారాన్ని తినాలని సూచిస్తున్నారు.
మూలికా నివారణలు:ఆయుర్వేద మూలికలైన బ్రాహ్మి (బాకోపా మొన్నీరి), అశ్వగంధ (వితానియా సోమినిఫెరా), లికోరైస్ (గ్లైసిరిజా గ్లాబ్రా) వంటివి.. పొగాకు అలవాటును మానుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్పష్టతను పెంపొందించడానికి సహాయపడే అడాప్టోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయని చెబుతున్నారు. అదనంగా.. త్రిఫల చూర్ణం కూడా టొబాకో అలవాటును మానుకోవడానికి సహాయపడుతుందని ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను పునరుద్ధరించడంలో సహాయపడతుందని అంటున్నారు.