Does Filtered Water Cause Cancer : మీరు రోజూ ఫిల్టర్ వాటర్ తాగుతున్నారా? అయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట! ఫిల్టర్ ప్రక్రియలో భాగంగా వాడే క్లోరిన్ వల్ల వివిధ రకాల క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉందని తాజాగా జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. నీటి ద్వారా ఒంట్లోకి చేరే ట్రైహాలోమీథేన్ (టీహెచ్‌ఎం), నైట్రేట్‌తో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. వేగంగా వ్యాపించే కణుతులకు ఈ రసాయనాలకు ఎక్కువ సంబంధం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సాధారణంగానే మనం తాగే నీటిని శుద్ధి చేసేందుకు క్లోరిన్ అనే రసాయనాన్ని వాడుతుంటారు. దీని వల్ల నీటిలో ఉండే హానికారక క్రిములు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే బ్యాక్టీరియాను తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో వాడే క్లోరిన్‌తో ట్రైహాలోమీథేన్ (టీహెచ్‌ఎం) అనే కారకం ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని.. ముఖ్యంగా క్యాన్సర్ ముప్పును పెంచుతున్నట్లు వివరించారు. దీని వల్ల మూత్రాశయ క్యాన్సర్ 33శాతం ముప్పు ఉందని, పెద్దపేగు క్యాన్సర్ 15శాతం వచ్చే అవకాశం పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇంకా గర్భిణీలకు గర్భస్రావం, తక్కువ బరువుతో జననం, శిశువుల్లో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
తాగునీటిలో సాధారణంగా కనిపించే కాలుష్య కారకాల్లో నైట్రేట్ ఉంటుందుని నిపుణులు చెబుతున్నారు. పొలాల్లో వాడే ఎరువులు, పశుపెంపకం కేంద్రాల నుంచి వచ్చే వ్యర్థాల్లో నైట్రేట్ అధిక మోతాదులో ఉంటుందని వివరిస్తున్నారు. అది భూగర్భజలాల్లోకి, వర్షాల ద్వారా నదుల్లోకి చేరుతుందని వెల్లడిస్తున్నారు. నిజానికి ఈ పదార్థం ప్రకృతిలో భాగమై అయినా, మానవ చర్యల ఫలితంగా దీని సహజ చక్రం మారిపోతోందని పేర్కొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఏంటీ పరిశోధన?
దీర్ఘకాలం పాటు నీటి ద్వారా శరీరంలోకి చేరే నైట్రేట్, టీహెచ్‌ఎంల వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా అన్న విషయంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. ఇందుకోసం 2008 నుంచి 2013 మధ్య స్పెయిన్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 697 మంది ప్రోస్టేట్ క్యాన్సర్ బాధితుల వివరాలను విశ్లేషించారు. ఇందులో వేగంగా వ్యాపించే కణితులు 97 మందిలో ఉన్నాయని కనిపెట్టారు. 8 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి ఎంత పరిమాణంలో నైట్రేట్, టీహెచ్‌ఎంలు తీసుకున్నారనే విషయాన్ని పరిశీలించారు. వారు ఏ ప్రాంతంలో నివసించారు? ఎలాంటి నీరు తాగారు? జీవితకాలంలో ఎంత పరిమాణంలో నీరు తాగారు? అక్కడి భూగర్భజలాల్లోని రసాయనాల తీరు వంటి వివరాలను పరిశీలించారు.