Hair Washing Mistakes : స్నానం చేస్తున్నప్పుడు.. దువ్వెనతో దువ్వుకుంటున్నప్పుడు వెంట్రుకలు రాలిపోతుంటే మనసంతా ఎంతో బాధగా ఉంటుంది. నాకే ఎందుకిలా జుట్టు రాలిపోతోందని కుంగిపోతుంటారు. హెయిర్ ఫాల్‌కు కారణం తలకు నూనె సరిగా రాయడం లేదనో విటమిన్ల లోపం వల్లనో కావచ్చని మెజారిటీ జనాలు అభిప్రాయపడుతుంటారు. అయితే.. తలస్నానం చేసేటప్పుడు చేసే పొరపాట్లు వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. మరి.. మీరు ఆ మిస్టేక్స్ చేస్తున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి.
ఎక్కువ సేపు తలస్నానం చేయడం :
కొంత మందికి ఎక్కువ సేపు తలస్నానం చేస్తుంటారు. కానీ.. ఇలా చేయడం వల్ల హెయిర్‌లోని నేచురల్ ఆయిల్ అంతా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు జుట్టు నీటిలో నానడం వల్ల జుట్టులోని సహజ నూనె గుణాలు తొలగిపోయి పొడిగా మారుతుందని చెబుతున్నారు. అందుకే ఎక్కువ సేపు తలస్నానం చేయకూడదని సూచిస్తున్నారు.
వేడి నీటిని ఉపయోగించడం :
కొంత మందికి వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్‌గా అనిపించవచ్చు. దీంతో తరచూ హాట్ వాటర్‌తో తలస్నానం చేస్తారు. అయితే, ఇలా దీర్ఘకాలికంగా వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల పురుషులలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుందట. అలాగే.. హెయిర్ పొడిగా మారి దురద కూడా వెంటాడుతుందని అంటున్నారు. అందుకే గోరువెచ్చని నీళ్లతో లేదా చల్లటి నీళ్లతో తలస్నానం చేయాలని సూచిస్తున్నారు.
పరిశోధన వివరాలు :
2016లో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎస్థటిక్ డెర్మటాలజీ' జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఒక అధ్యయనంలో వేడి నీళ్లతో స్నానం చేయడం, జుట్టు రాలడం మధ్య సంబంధాన్ని పరిశీలించారు. ఈ అధ్యయనంలో 100 మంది పురుషులు పాల్గొన్నారు. వారిని రెండు గ్రూపులుగా చేశారు. అందులో 50 మంది 6 నెలలపాటు వేడి నీళ్లతో తలస్నానం చేశారు. మిగతా 50 మంది చల్లనీటితో తలస్నానం చేశారు. అయితే, వేడి నీళ్లతో తలస్నానం చేసిన పురుషులలో జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట.