The Goat Life Movie: 'సలార్' సినిమాతో వరదరాజ మన్నార్‌గా టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఈయన తాజాగా నటించిన 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) సినిమా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తీయాలని 2008 లోనే ప్లాన్ చేస్తే, ఎట్టకేలకు 16 ఏళ్ల తర్వాత బిగ్ స్క్రీన్‌లోకి రాబోతుందని హీరో పృథ్వీరాజ్ అన్నారు.
'ది గోట్ లైఫ్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న పృథ్వీరాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సినిమా ఎక్కడా రాజీ పడకుండా తీయాల్సిన ప్రాజెక్ట్ అని పృథ్వీరాజ్ అన్నారు. కేవలం షూటింగ్ విషయంలోనే కాదు, పోస్ట్ ప్రొడక్షన్‌లోనూ ఒక్క ఫ్రేమ్ కూడా రాజీపడకుండా డిజైన్ చేసినట్లు సినిమా కథానాయకుడు పృథ్వీ రాజ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎన్ని అడ్డంకులు వచ్చినా సినిమాను కచ్చితంగా తీయాలనే నిర్ణయించుకున్నారనీ, అందుకే 2008లో ప్లాన్ చేసిన ఈ సినిమాను పదేళ్ల తర్వాత 2018లో షూటింగ్ ప్రారంభించి ఎట్టకేలకు మార్చి 28, 2024న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఆయన వివరించారు.
ఇక డైరెక్టర్ బ్లెస్లీ ఈ సినిమాను బెంజమిన్ రాసిన 'గోట్ డేస్' నవల ఆధారంగా తెరకెక్కించారు. విజువల్ రొమాన్స్ బ్యాన్యర్ నిర్మాణంలో, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ కంపనీ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. మైత్రీ మూవీ కంపెనీ సహకారంతో 'ది గోట్ లైఫ్' చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు పృథ్వీరాజ్. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సరసన బ్యూటిఫుల్ నటి అమలాపాల్ నటించింది.