Oscars 2025 Interesting Facts : ఎన్ని సినిమాలు తీసినా, ఎంత గొప్ప అవార్డులను దక్కించుకున్నా, ఆస్కార్ అవార్డు నటీనటుల జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఈ పురస్కారాన్ని ఒక్కసారైనా దక్కించుకోవాలనే కోరికతో తమ సినీ ప్రయాణంలో దశాబ్దాలుగా ఎదురుచూసే తారలు ఈ చిత్రసీమలో ఎందరో ఉన్నారు. చలన చిత్రంలో ఎంతో గొప్పగా భావించే ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాన్ని సొంతం చేసుకోవడానికి ఈ ఏడాది పలువురు నటీనటులు, దర్శకులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో మార్చి 2న(భారత కాలమానం ప్రకారం మార్చి 3న) ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులందరూ ఎదురుచూస్తున్న అస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలో లాస్ ఏంజెలెస్‌లో జరగనుంది. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
57 ఏళ్ల తర్వాత
1968 తర్వాత సంగీత నేపథ్యం ఉన్న రెండు సినిమాలు (వికెడ్, ఎమిలియా పెరెజ్) ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. ఆస్కార్ చరిత్రలో రెండు మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రాలు 10 లేదా అంతకంటే ఎక్కువ కేటగిరీల్లో నామినేట్ కావడం ఇది రెండోసారి. మొత్తం నామినేషన్ల రేసులో ఎమిలియా పెరెజ్ 13 విభాగాల్లో ముందంజలో ఉంది. అలాగే ఉత్తమ దర్శకుడు, రచనా విభాగంలో నామినేట్ కాకుండా 10 కేటగిరీల్లో నామినేషన్స్ అందుకున్న మొదటి చిత్రంగా వికెడ్ రికార్డు సృష్టించింది.
ఎమిలియా పెరెజ్ సినిమాను జాక్వెస్ ఆడియార్డ్ తెరకెక్కించారు. పరిస్థితుల కారణంగా ట్రాన్స్‌జెండర్‌గా మారిన ఓ డ్రగ్స్ లార్డ్ అనుభవాల్ని తెరపై కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఆయన విజయవంతమయ్యారు. ఈ క్రమంలో దర్శకుడి విభాగంలో నామినేషన్‌ను సంపాదించుకున్నారు.
తొలి ట్రాన్స్ జెండర్
97వ అస్కార్ పురస్కారాల్లో ఉత్తమ నటి నామినేషన్ దక్కించుకున్న మరో హాలీవుడ్ నటి కర్లా సోఫియా గాస్కాన్. అండర్ వరల్డ్ డ్రగ్స్ నేపథ్యంలో సాగే 'ఎమిలియా పెరెజ్' చిత్రానికి గానూ ఆమె ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన మొదటి ట్రాన్స్ జెండర్ కూడా ఈమే. కర్లా సోఫియా గతంలో ఎక్స్ వేదికగా జార్జ్ ఫ్లాయిడ్, ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
మొదటి బ్రెజిలియన్గా రికార్డు
ఫెర్నాండా టోర్రెస్ నటించిన ఐ యామ్ స్టిల్ హియర్ అస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ఒకవేళ ఫెర్నాండా టోర్రెస్ ఈ అవార్డు దక్కించుకుంటే ఓ రికార్డు ఆమె ఖాతాలో పడుతుంది. అస్కార్ అవార్డు అందుకున్న మొదటి బ్రెజిలియన్గా ఆమె రికార్డు సృష్టిస్తారు.
సహాయ నటుడి విభాగంలో పోటీ
ఉత్తమ సహాయ నటుడి విభాగంలో పోటీ పడుతున్న కిరెన్ కల్కిన్ (ది రియల్ పెయిన్), జెరీమీ స్ట్రాంగ్ (ది అప్రెంటిస్) ఇదే మొట్టమొదటి ఆస్కార్ నామినేషన్.