Indian Movie Kamal Haasan :భారతీయ చలనచిత్ర రంగంలోని ప్రముఖ హీరోల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయన చేసిన పాత్రలు, సినిమాలు మరొకరికి సాధ్యం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కమల్ హాసన్ ఫిల్మోగ్రఫీలో చాలా బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నాయి. కొన్ని విజిల్ వేయిస్తే, మరికొన్ని కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా 1996లో విడుదలైన ఇండియన్(తెలుగులో భారతీయుడు) చాలా ప్రత్యేకం. ఈ సినిమా గొప్పదనం, రికార్డులు అందరికీ తెలుసు. కానీ ఎవ్వరికీ తెలయని ఓ ఆసక్తికరమై అంశం ఉంది.
అదేంటంటే, వాస్తవానికి భారతీయుడు మూవీలో మొదట హీరోగా అనుకున్నది కమల్ హాసన్ కాదు. అతడి కంటే ముందు మరో స్టార్ హీరో వద్దకు వెళ్లిందంట. కొన్ని కారణాల వల్ల కమల్ హాసన్‌కు అవకాశం దక్కింది. ఇంతకీ ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
భారతీయుడికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన వసంత బాలన్ తెలిపిన వివరాల ప్రకారం, డైరెక్టర్ శంకర్ మొదటి సినిమా జెంటిల్‌మెన్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో శంకర్ వద్ద ఏదైనా మంచి కథ ఉందేమోనని సూపర్ స్టార్ రజనీకాంత్ సంప్రదించారట. దీంతో శంకర్, పెరియ మానుషన్ అనే కథ చెప్పారు. అదే ‘భారతీయుడు’. రజనీకాంత్‌కు స్టోరీ చాలా నచ్చింది. కానీ చివరికి ఆ సినిమాలో యాక్ట్ చేయడం కుదరలేదు. అప్పటికే తన మందున్న ప్రాజెక్టులు, పనులతో దూరమయ్యారు.
శంకర్ వెంటనే కమల్ హాసన్‌ను సంప్రదించారు. ఐకానిక్ క్యారెక్టర్ సేనాపతి పాత్రని వివరించారు. ఆసక్తికరంగా ఈ సినిమాలో నటించే అవకాశం కోల్పోయిన వారిలో రజనీకాంత్‌తో పాటు మరికొందరు నటీనటులు కూడా ఉన్నారు. భారతీయుడులో కొడుకు పాత్ర కోసం నాగార్జున, వెంకటేష్ వంటి పెద్ద స్టార్ పేర్లు పరిశీలించారు. ఓ దశలో నటుడు రాజశేఖర్‌ను కూడా తండ్రి పాత్రకు పరిశీలించారు. ఈ స్టార్‌లు అందరూ అవకాశం కోల్పోయినా, సినిమాకు కమల్ హాసన్ వందకు వంద శాతం న్యాయం చేశారు. ఇప్పడు ఆ పాత్రల్లో ఆయన్ను తప్ప మరొకరికి ఊహించుకోలేం. రెండు పాత్రల్లో కమల్ హాసన్ చూపించిన వ్యత్యాసానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఇండియన్ 3 ఎప్పుడంటే?
ఈ మూవీకి 2024లో సీక్వెల్ ఇండియన్ 2 కూడా వచ్చింది. ఇందులో అదే పాత్రలో కమల్ హాసన్ నటించారు. ఈ సినిమాకి ఊహించిన విజయం అందలేదు. అయితే త్వరలో ఇండియన్ 3 కూడా రానుంది. 2025 జనవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్ రిలేషన్‌పై అప్పుడప్పుడూ కొన్ని ఊహాగానాలు వినిపిస్తుంటాయి. కానీ ఇద్దరూ చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో కలిసి సాగుతున్నారు. వీరిద్దరూ కలిసి దాదాపు 16 సినిమాల్లో నటించారు.