తన తొలి సినిమాకు పది రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న ఓ స్టార్ హీరోయిన్, తన నటనతో అనతికాలంలోనే ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా ఎదిగారు. వరస ఆఫర్లు అందుకుని సౌత్ ఇండస్ట్రీలో దూసుకెళ్లారు. ఆ తర్వాత బీటౌన్‌లోనూ తానేంటో నిరూపించుకున్నారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర వంటి టాప్ హీరోలతో నటించి అత్యథిక రెమ్యూనరేషన్ అందుకునే రేంజ్‌కు వెళ్లిపోయారు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఆమె తీసుకున్న ఓ నిర్ణయం వల్ల తన పర్సనల్ లైఫ్‌లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఆమె వాటిని ఎదుర్కొన్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు తన అందం, అభినయంతో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన సీనియర్ నటి జయప్రద(Actress Jayaprada Biography).
1962లో రాజమండ్రిలో జన్మించిన జయప్రద అసలు పేరు లలిత రాణి రావు. స్కూల్లో చదువుతున్న సమయంలో ఆమె చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్‌ను చూసిన ఓ డైరెక్టర్ ఆమెకు ఓ సినిమాలో నటించేందుకు ఆఫర్ ఇచ్చారు. అలా తన 13వ ఏట సినీతెరంగేట్రం చేశారు. 'భూమి కోసం' అనే సినిమాలో ఆమె అతిథిగా కనిపించారు. ఇందుకుగానూ ఆమె రూ. 10 పారితోషకంగా అందుకున్నారు. స్క్రీన్‌పై కనిపించింది తక్కువ నిడివికే అయినప్పటికీ తన డ్యాన్స్‌తో జయప్రద అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో ఆమెను వరుస ఆఫర్లు వరించాయి. అలా తమిళ డైరెక్టర్ బాలచందర్ తెరకెక్కించిన 'అంతులేని కథ' సినిమాతో అఫీషియల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే నెమ్మదిగా తన అడుగులు బాలీవుడ్ వైపుకు పడ్డాయి. అక్కడ అమితాబ్, జితేంద్ర లాంటి అగ్ర తారల సరసన మెరిశారు. బాలీవుడ్‌లోనూ తన నటనకు ప్రశంసలు అందుకున్నారు.
అలా తన కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో ఆమె శ్రీకాంత్ నహాతా అనే నిర్మాతను వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే శ్రీకాంత్‌కు చంద్ర అనే మహిళతో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతే కాకుండా ఆయన జయప్రదను వివాహం చేసుకునే సమయానికి తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇవ్వలేదు. దీంతో జయప్రద- శ్రీకాంత్ వివాహం కాస్త వివాదాస్పదంగా మారింది.