Tax Saving Ways :ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలని ఎవరికి మాత్రం ఉండదు!! అందుకోసం దొరికే ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రతీ ఒక్కరు ప్రయత్నిస్తారు. అలాంటి కొన్ని అవకాశాలే ఇప్పుడు మన ముందు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు డెడ్‌లైన్ మార్చి 31తో ముగుస్తుంది. ఎందుకంటే ఆ తేదీతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెట్టుబడులపై ముందుచూపుతో తగిన ప్లానింగ్ చేసుకునే వారంతా ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం అనుసరించాల్సి ఏడు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పన్ను ఆదా- ప్రయోజనకర ఆప్షన్లు
నెలవారీ శాలరీ పొందే వ్యక్తులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులను పొందొచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వంటి ఆప్షన్లను వాడుకోవచ్చు. మన శాలరీ బేసిక్‌లో 12 శాతాన్ని నెలవారీ పెట్టుబడిగా ఈపీఎఫ్‌లోకి మళ్లించవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది 15 సంవత్సరాల సురక్షితమైన ప్రభుత్వ పెట్టుబడి పథకం. దీనిలో 7 సంవత్సరాల తర్వాత పాక్షిక లిక్విడిటీ లభిస్తుంది. అంటే అమౌంట్‌ను కొంతమేర విత్‌డ్రా చేయొచ్చు. మన పెట్టుబడిపై దాదాపు 8 శాతం రాబడిని పొందొచ్చు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు కనీసం 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్‌తో వస్తాయి. ఇవి స్టాక్ మార్కెట్ లింక్డ్ రిటర్న్‌లను అందిస్తాయి. ఈ మార్గాల ద్వారా రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా అవడంతో పాటు మీ పెట్టుబడులు క్రమంగా పెరుగుతాయి.
2. పన్ను ఆదా- ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వ పథకాల్లో చేరడం ద్వారా మీరు పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. రాబడిని కూడా గణనీయంగా పెంచుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C మీ మొత్తం వార్షిక ఆదాయం నుంచి రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును అనుమతిస్తుంది. పన్ను మినహాయింపుల కోసం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లను వాడుకోవచ్చు.
3. ఎలక్ట్రిక్ వాహనం లోన్‌పై వడ్డీ చెల్లింపులు
ఎలక్ట్రిక్ వాహనాన్ని లోన్‌పై కొన్నవారు కూడా పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. అయితే 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనం కొన్నవారు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 80EEB కింద పన్ను ప్రయోజనం పొందేందుకు అర్హులు.గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు లోన్ వడ్డీ చెల్లింపులపై ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. ఈ వడ్డీని పన్ను చెల్లింపుదారుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొన్న వారంతా ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు.
4. ఆరోగ్య బీమా ప్రీమియంలపై తగ్గింపులు
ఆరోగ్య బీమా ప్రీమియంలపై మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా పన్నుభారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. మీరు మీకు, మీ జీవిత భాగస్వామికి, మీపై ఆధారపడిన పిల్లలకు ఆరోగ్య బీమా ప్రీమియంలను చెల్లిస్తున్నట్లయితే రూ.25,000 వరకు తగ్గింపును పొందొచ్చు. వీరితో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్య బీమాను కూడా చెల్లిస్తున్నట్లయితే సీనియర్ సిటిజన్ కేటగిరీలో రూ.50వేల దాకా పన్నుమినహాయింపు లభిస్తుంది. ఈ లెక్కన మీ కుటుంబం కోసం చెల్లించే మొత్తం ఆరోగ్య బీమా ప్రీమియంలపై సగటున రూ.75వేల నుంచి రూ.లక్ష దాకా ట్యాక్స్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.