RBI On Interest Charges : లోన్లపై వడ్డీ వసూలు చేసే విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. రుణగ్రహీతల నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీలను తిరిగి చెల్లించాలని బ్యాంకులకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 2003 నుంచి తన నియంత్రణ పరిధిలోని (ఆర్‌ఈ) సంస్థలకు పలు సందర్భాల్లో ఆర్‌బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది.
'అన్యాయమైన పద్ధతులను పాటిస్తున్నారు!'
రుణ దాతలు వడ్డీ వసూలు చేయడంలో న్యాయబద్ధత, పారదర్శకతను పాటించాల్సిన అవసరాన్ని ఆ మార్దదర్శకాలు సూచిస్తాయి. అదే సమయంలో రుణాల వడ్డీ విధానానికి సంబంధించిన స్వేచ్ఛను కూడా అందిస్తాయి. 2023 మార్చి 31తో ముగిసిన కాలానికి ఆర్‌ఈలను పరిశీలిస్తున్న క్రమంలో, రుణదాతలు కొన్ని అన్యాయమైన పద్ధతులను పాటిస్తున్నట్లు ఆర్‌బీఐ ఇటీవల గుర్తించింది.
'వడ్డీని ముందే వసూలు చేస్తున్నారు!'
అన్ని ఆర్‌ఈలు రుణాల పంపిణీ విధానం, వడ్డీ విధింపు, ఇతర ఛార్జీలను సమీక్షించాలని ఆర్‌బీఐ తెలిపింది. ఇందుకు అనుగుణంగా వ్యవస్థలో మార్పులు చేసి దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోవాలని సూచించింది. ఆర్‌ఈల క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో, రుణం మంజూరు చేసిన తేదీ లేదా రుణ ఒప్పందాన్ని అమలు చేసిన తేదీ నుంచి వడ్డీ వసూలు చేయడాన్ని గమనించినట్లు తెలిపింది. వాస్తవానికి ఇది రుణం పంపిణీ చేసిన తేదీ నుంచి లెక్కించాలి. రుణం మంజూరైన చాలా రోజులకు ఆ మొత్తం అందించినా, వడ్డీని ముందే వసూలు చేస్తున్నారని ఆక్షేపించింది.