తెలంగాణ

telangana

ETV Bharat / business

'మోదీ 3.0 సర్కార్'కు అంత ఈజీ కాదు!​ వారు ఓకే అంటేనే అవన్నీ సాధ్యం!! - BJP Economic Reform Challenges - BJP ECONOMIC REFORM CHALLENGES

BJP Economic Reform Challenges : బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చింది! కానీ ఇప్పుడు బీజేపీ పరిస్థితి మునుపటిలా లేదు. కచ్చితంగా ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా, మిత్రపక్షాలపై ఆధారపడాల్సిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మోదీ 3.0 సర్కార్ మునుపటిలా​ ఆర్థిక సంస్కరణలను అమలు చేయగలదా? విప్లవాత్మకమైన కొత్త ఆర్థిక సంస్కరణలను చేపట్టగలదా?

PM MODI
modi 3.0 economic reforms (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 6:40 PM IST

BJP Economic Reform Challenges : మోదీ సర్కార్ గత పదేళ్ల పాలనలో అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి వ్యాపార వర్గాల ఆదరాభిమానాలు పొందింది. ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి, మరిన్ని విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని ఆశించింది. అయితే ఇప్పుడు అదంత సులువుగా జరిగే అవకాశం కనిపించడం లేదు.

ఇకపై కష్టమే!
ప్రస్తుతం బీజేపీ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ప్రధాని నరేంద్ర మోదీ 'అబ్ ​కీ బార్​ ఛార్​ సౌ పార్'​ అని నినాదం ఇచ్చినప్పటికీ అది నెరవేరలేదు. కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా సొంతంగా రాలేదు. అందుకే ఎన్​డీఏ కూటమిలోని మిగతా మిత్రపక్షాలపై కచ్చితంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పరోక్షంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సంస్కరణలు చేపట్టడానికి పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

గ్లోబల్ మాన్యుఫాక్చురింగ్ హబ్​​!
భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చురింగ్ హబ్​ (అంతర్జాతీయ తయారీ కేంద్రం)గా మార్చాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. దేశీయంగా సెమీకండక్టర్ తయారీ సంస్థలను, ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలను ప్రోత్సహించాలని, ఇందుకోసం భారీ రాయితీలు కల్పించాలని భావించింది. కానీ ఇదంతా చేయాలంటే, విధానపరమైన ఆర్థిక సంస్కరణలు చేయాల్సి ఉంటుంది. మిత్రపక్షాల మద్దతు లేకపోతే ఇది సాధ్యమయ్యే పనికాదు.

కార్మిక చట్టాల ప్రక్షాళన
మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కూడా ప్రక్షాళన చేయాలని ఆలోచిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలకు మరింత స్వేచ్ఛ కల్పించాలని భావిస్తోంది. భారత దేశంలో 100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు ప్రత్యేకమైన ప్రతిబంధకాలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ సంస్థలు కొత్త వారిని నియమించుకోవాలన్నా లేదా ఉన్న ఉద్యోగులను తొలగించాలన్నా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. దీని వల్ల డిమాండ్​కు అనుగుణంగా ఉద్యోగులను నియమించుకోవడానికి వీలుకాకుండా ఉంది. దీనిని తొలగించాలని మోదీ సర్కార్ భావించింది. ఈ థ్రెషోల్డ్​ను 300కు పెంచుతూ పార్లమెంట్​లో ఓ చట్టాన్ని కూడా ఆమోదించింది. అయితే దీనికి రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి. ఒకవేళ ముచ్చటగా మూడోసారి కూడా తమ ప్రభుత్వం వస్తే, దీనిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని మోదీ సర్కార్​ అనుకుంది. ఇకపై ఇది కూడా కష్టమయ్యే అవకాశం ఉంది.

పన్నుల తగ్గింపు?
దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తున్న కారణంగా భారతదేశంలో తయారీ ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. అందుకే దిగుమతి సుంకాలు తగ్గించాలని బీజేపీ సంకల్పించింది. దేశీయంగా స్మార్ట్​ఫోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, ఇప్పటికే ముఖ్యమైన విడిభాగాల దిగుమతులపై 10 శాతం వరకు సుంకాలు తగ్గించింది. త్వరలో మరిన్ని దిగుమతులపై సుంకాలు తగ్గించాలని భావించింది. కానీ మిత్రపక్షాల మద్దతు లేకపోతే ఇది కూడా కష్టమే.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​?
మోదీ సర్కార్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ను తీర్చిదిద్దాలని ఆశించింది. దాదాపుగా దానిని సాధించింది. ఇప్పుడు ఎన్నికల మ్యానిఫెస్టోలో భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని హామీ ఇచ్చింది. దీనికి కచ్చితమైన దీర్ఘకాలిక ప్రణాళికతో పాటు, గొప్ప ఆర్థిక సంస్కరణలు అవసరం.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుండడం ఒక మంచి పరిణామం. దీనిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు, వ్యవస్థాపక స్ఫూర్తి (entrepreneurial sprit) పెంపొందించడానికి మోదీ సర్కార్​ కృషి చేసింది. ఇంకా చాలా ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ మిత్రపక్షాల మద్దతు లేకపోతే ఇది సాధ్యమయ్యే పనికాదు.

వికసిత్ భారత్​ 2047
బీజేపీ భారతదేశాన్ని ఒక ఉత్పాదక శక్తిగా మార్చాలని ఆశిస్తోంది. ఇందుకోసం అనేక భూ సంస్కరణలు, కార్మిక సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. చైనాకు పోటీగా భారత ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేయాలని మోదీ సర్కార్​ ఆశ. కానీ ఇకపై ఇది చేయడం చాలా కష్టం. ఎందుకంటే?

చైనా 1970ల్లో ఒక చట్టం చేసి, భూయాజమాన్యాన్ని వినియోగ హక్కుల నుంచి వేరు చేసింది. పెట్టుబడిదారులకు పారిశ్రామిక అవసరాల కోసం చాలా సులువుగా భూమిని కేటాయించేలా చేసింది. దీని వల్ల చైనా చాలా తక్కువ కాలంలోనే పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది.

కానీ భారతదేశంలో ఇలాంటి సంస్కరణలు చేపట్టడం అంత సులువు కాదు. భూయజమానుల నుంచి వారి భూమిని తీసుకుని, పారిశ్రామికవేత్తలకు ఇవ్వడం అంత సులువు కాదు. ఒకవేళ ఇలా చేయాలంటే, చాలా కఠినమైన చట్టాలు చేయాల్సి ఉంటుంది. పైగా భూయజమానుల నుంచి, రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఈ విషయంలో మోదీ సర్కార్​కు మిత్ర పక్షాలు సహకరించే అవకాశం దాదాపు లేదని చెప్పవచ్చు.

మేకిన్ ఇన్ ఇండియా
మోదీ 2.0 హయాంలో మేక్ ఇన్ ఇండియా స్కీమ్​, పీఎల్​ఐ (ప్రొడక్షన్ లింక్డ్​ ఇన్సెంటివ్స్)​ స్కీమ్ కింద తయారీ రంగానికి ప్రోత్సాహం అందించారు. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఇకపై కూడా మౌలిక సదుపాయాల కల్పనపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలా మూలధనాన్ని సేకరించాలి. పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలి.

మోదీ సర్కార్ 3.0 వస్తే, ఇండియాలో ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్​, ఆటోమొబైల్స్​, మొబైల్ తయారీ రంగాల అభివృద్ధికి మరింత చేయూత ఇవ్వాలని బీజేపీ ఆశించింది. భారత్​ను గ్లోబల్ వాల్యూ చెయిన్​లో కీలక ప్లేయర్​గా మార్చాలని ఆశించింది. ఇదంతా జరగాలంటే, ఎన్​డీఏ కూటమిలోని మిత్రపక్షాల సహకారం తప్పనిసరి.​

మోదీ సర్కార్ కృషి వల్ల ప్రపంచ తయారీలో భారతదేశం వాటా 3 శాతం వరకు పెరిగింది. కానీ చైనా (24 శాతం)తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఇండియా కనుక చైనాను తయారీ రంగంలో అధిగమించాలంటే, కచ్చితంగా భూ, కార్మిక సంస్కరణలు చేయాల్సి ఉంటుంది. ఇది మిత్రపక్షాల సహకారం లేనిదే సాధ్యం కాదు.

ఎగుమతులు పెంచాలి!
ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా ఎగుమతులు పెంచుకోవాలి. ఇందుకోసం అంతర్జాతీయ సహకారం, అవస్థాపన అభివృద్ధి సహా, చట్టాలను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు పారిశ్రామికవేత్తలపై, ఉత్పత్తిదారులపై పన్నుల భారాన్ని తగ్గించాలి. ఇందుకోసం కూడా చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు మోదీ సర్కార్​కు సొంతంగా మెజారిటీ ఉన్న కారణంగా, వేగంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోగలిగింది. కానీ ఇకపై అలా జరిగే అవకాశం లేదు.

ఉపాధి అవకాశాలు కల్పించాలి!
భారతదేశంలో భారీ స్థాయిలో నిరుద్యోగిత ఉంది. అందుకే నేటి యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం వస్తు, సేవల రంగాలను ప్రోత్సహించాలి. గ్రామీణ పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. యువతకు ఉపయోగపడే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. పర్యటక రంగాన్ని కూడా ప్రోత్సహించాలి. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు మాత్రమే కాదు, స్వయం ఉపాధి మార్గాలను కల్పించాలి. జీవనోపాధి అవకాశాలను పెంచాలి. వాస్తవానికి ఇవన్నీ చేస్తామని మోదీ సర్కార్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ ఇవన్నీ చేయాలంటే, మిత్రపక్షాల మద్దతు కచ్చితంగా ఉండాల్సిందే.

మౌలిక సదుపాయాల కల్పన
మోదీ ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో భారత్​లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించింది. దేశవ్యాప్తంగా 31,000 కి.మీ రైల్వే ట్రాక్ నిర్మించింది. 20కిపైగా నగరాల్లో మెట్రో నెట్​వర్క్​లను విస్తరించింది. ఇప్పుడు మోదీ 3.0 హయాంలో మరిన్ని రైల్వే ట్రాక్​లు, మోట్రో నెట్​వర్క్​లు, బుల్లెట్​ రైల్ కారిడార్లు, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి భారీ స్థాయిలో నిధులు అవసరం. దీనికి కూడా మిత్ర పక్షాల సహకారం అవసరం అవుతుంది.

డిజిటల్ రివల్యూషన్​
మోదీ ప్రభుత్వం 2047 నాటికి ఎనర్జీ ఇండిపెండెన్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, ఇంధన సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది.

భారతదేశంలోని ప్రతిగ్రామానికి భారత్​నెట్​ను విస్తరించాలని యోచిస్తోంది. అందరికీ హై-స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పించాలని ఆశిస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తే, ఈ సంస్కరణలు అన్నీ చేస్తామని మోదీ సర్కార్ ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన ఎన్నికల ఫలితాలు, బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. ఏం చేయాలన్నా మిత్రపక్షాల సహకారం తప్పనిసరి. మరోవైపు ఇండియా కూటమి చాలా బలం పుంజుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ సర్కార్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది.

రక్తమోడిన దలాల్​ స్ట్రీట్​- సెన్సెక్స్ 4390 పాయింట్లు డౌన్- రూ.35లక్షల కోట్లు ఆవిరి! - Stock Market Close

మంచి ఆరోగ్య బీమా పాలసీ ఎంచుకోవాలా? ఈ టాప్​-6 టిప్స్ మీ కోసమే! - How To Choose Best Health Insurance

ABOUT THE AUTHOR

...view details