BYJUs Raveendran ED : ప్రముఖ ఎడ్యూటెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూడాలని ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులను ఈడీ కోరింది. కాగా, హై-స్టేక్స్ ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్‌కు ఒకరోజు ముందు ఈడీ ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం. శుక్రవారం జరగనున్న ఈ సమావేశంలో కొంతమంది పెట్టుబడిదారులు రవీంద్రన్‌ను ప్రస్తుతం కొనసాగుతున్న పదవిలో నుంచి బర్తరఫ్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
'ఎటువంటి తీర్మానాలను ఆమోదించవద్దు'
ఈజీఎం సమయంలో ఎటువంటి తీర్మానాలను ఆమోదించవద్దని, తుది విచారణ వరకు వేచి ఉండాలిని బుధవారం కర్ణాటక హైకోర్టు బైజూస్ వాటాదారులను కోరింది. షేర్‌హోల్డర్ల సమావేశం నిర్వహించకుండా చూడాలని బైజూస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. అయితే ఈజీఎం నిర్వహణపై న్యాయమూర్తి స్టే ఇవ్వకుండానే తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేశారు.
విచారణకు గైర్హాజరు
ED Notice To BYJUs Founder :గతేడాది ఏప్రిల్‌లో బెంగళూరులోని రవీంద్రన్‌కు చెందిన రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఫెమా నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలతో పాటు డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. కొందరు బయట వ్యక్తుల ద్వారా వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామని అప్పట్లో ఈడీ తెలిపింది. కాగా, ఇప్పటికే రవీంద్రన్‌కు పలుమార్లు ఈడీ సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదని అధికారులు చెప్పారు.