Atal Pension Yojana News : కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కింద ఇచ్చే కనీస పింఛన్‌ను రూ.10,000కు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆమోదానికి సిద్ధంగా ఉందని, బహుశా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2025లో దీనిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
'అటల్ పెన్షన్ యోజన కింద ఇచ్చే కనీస పింఛన్‌ను రెట్టింపు చేసే ప్రతిపాదన దాదాపు ఆమోదానికి సిద్ధంగా ఉంది. దీనిని 2025 బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. దీని ద్వారా చందాదారులకు కాస్త ఆర్థిక స్థిరత్వం, భద్రత ఏర్పడతుంది' అని ఓ ప్రభుత్వాధికారి చెప్పినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 మే 9న అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించారు. పేదలు, అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కల్పించడమే లక్ష్యంగా ఈ సామాజిక భద్రతా పథకాన్ని తీసుకొచ్చారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరు మీద ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో చేరిన చందాదారులకు గరిష్ఠంగా రూ.5000 పింఛన్ అందిస్తున్నారు. దీనినే ఇప్పుడు రెట్టింపు చేయాలని కేంద్రం సంకల్పించినట్లు తెలుస్తోంది.