Woman Falls Into Well : కేరళలో ఓ అడవి పంది నుంచి తప్పించుకునే క్రమంలో ఓ మహిళ ప్రమాదవశాత్తు 50 అడుగుల లోతైన బావిలో పడిపోడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 20 గంటల పాటు శ్రమించి మహిళను సురక్షితంగా బయటకు తీశారు.
అసలేం జరిగిందంటే?
పతనంతిట్ట ప్రాంతానికి చెందిన ఓ యాబై ఏళ్ల మహిళను అడవి పంది వెంబడించింది. దీంతో ఆమె పరుగుతీసింది. అడవి పంది నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె పక్కనే ఉన్న బావిపై కప్పి ఉన్న చెక్కపలకపై దూకింది. అది విరిగిపోయి 50 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. ఆమె ఎంతకీ ఇంటికి రాకపోవడం వల్ల ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళ కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదును అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె కోసం గాలించారు. అయితే ఓ బావి ఉన్నచోట అరుపులు వినిపించాయనే సమాచారంతో ఆమెను బయటకు తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోలీసుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ఓ నెట్‌కు తాళ్లు అమర్చి బావిలోకి జారవిడిచి దాని సహాయంతో మహిళను బయటకు తీసేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు 20 గంటల పాటు శ్రమంచి ఆమెను బయటకు తీశారు. ' బావిని కప్పి ఉన్న చెక్క పలకపై ఆమె దూకడం వల్ల అది విరిగిపోయింది. దీంతో బావిలో చిక్కుకుంది. ఆమెను బయటకు తీసి ఆసుపత్రిలో చేర్పించాం. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది' ఫైర్ అండ్ రెస్క్యూ అధికారి తెలిపారు.