Union Cabinet Decisions On Natural Farming :ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించడానికి వీలుగా రాబోయే రెండేళ్లలో రూ.2481 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025-26 నాటికి సుమారు కోటి మంది రైతులు 7.5 లక్షల హెక్టార్లలో రసాయనాల రహిత సాగును చేపట్టడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. భూసార నాణ్యతను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2019-20 నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టిన పనులు ఇప్పటికే 10 లక్షల హెక్టార్లకు విస్తరించాయన్నారు. అంతేకాకుండా, పాన్ 2.0 ద్వారా పాన్‌కార్టు ఆధునికీకరణకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రకృతి సేద్యంపై కేంద్రం ఫోకస్ - రూ.2,481 కోట్లు కేటాయింపు - కేబినెట్ కీలక నిర్ణయాలివే!
దేశవ్యాప్తంగా రైతులను పకృతి సేద్యం వైపు మళ్లించడానికి రూ.2481 కోట్లు ఖర్చుచేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం - అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0కు రూ.2750 కోట్ల కేటాయింపు
Published : Nov 26, 2024, 7:02 AM IST
అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0కు రూ.2750 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వన్ నేషన్-వన్ సబ్‌స్క్రిషన్ అనే కొత్త పథకానికి రూ.6000 కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. పరిశోధనా వ్యాసాలు లేదా పత్రికలు పొందడానికి వీలుగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధన-అభివృద్ధి సంస్థల్లో చదువుకుంటున్న 1.8 కోట్ల మంది విద్యార్థులతో పాటు పరిశోధకులు, అధ్యాపకులకు లబ్ధి కలగనుందని వివరించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రూ.3689 కోట్లతో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని అశ్వివీ వైష్ణవ్ వెల్లడించారు.