SC Review On Governor Immunity :క్రిమినల్ కేసుల విషయంలో గవర్నర్లకు మినహాయింపునిచ్చే రాజ్యాంగ నిబంధనలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ మహిళా ఉద్యోగిని దాఖలు చేసిన పిటిషన్పై బంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. క్రిమినల్ కేసుల్లో గవర్నర్లకు రాజ్యాంగపరమైన మినహాయింపులు ఉన్న వ్యవహారంలో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సహాయాన్ని సుప్రీంకోర్టు కోరింది.
బంగాల్ రాజ్భవన్లో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం, క్రిమినల్ కేసుల నుంచి గవర్నర్లకు పూర్తి మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్లకు మినహాయింపుల విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇందులో కేంద్రాన్ని కూడా భాగస్వామిగా చేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గవర్నర్లకు మినహాయింపునిచ్చే రాజ్యాంగ నిబంధనలను పరిశీలించేందుకు అంగీకరించింది.
అసలేంటీ ఆర్టికల్ 361?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం, రాష్ట్రపతి, గవర్నర్లకు వ్యతిరేకంగా వారి పదవీకాలంలో ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్లు జరపడానికి వీలులేదు. అంటే ఈ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగ అధిపతులుగా ఉన్న రాష్ట్రపతి, గవర్నర్లకు సివిల్, క్రిమినల్ కేసుల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి.