తెలంగాణ

telangana

ETV Bharat / bharat

48గంటలు పాటు ప్రధాని మోదీ 'నాన్​స్టాప్​​ మెడిటేషన్'​- కారణం అదే! - Pm modi kanyakumari

PM Modi Meditation In Kanyakumari : లోక్‌సభ ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరుకున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మెడిటేషన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి ధ్యానం చేసేందుకు కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌‌‌ను ప్రధాని ఎంచుకున్నారు. ఇక్కడి చారిత్రక ధ్యాన మండపంలో మే 30వ తేదీన సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీన సాయంత్రం వరకు మోడీ మెడిటేషన్ చేయనున్నారు.

PM Modi Meditation In Kanyakumari
PM Modi Meditation In Kanyakumari (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 5:49 PM IST

PM Modi Meditation In Kanyakumari :ప్రతి లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ సమయానికి ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రంలో ధ్యానం చేసే ట్రెండ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటిన్యూ చేస్తున్నారు. ఈసారి ఆయన తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌‌లో ధ్యానం చేయబోతున్నారు. అలనాడు స్వామి వివేకానంద ధ్యానం చేసిన ధ్యాన మండపంలో మే 30వ తేదీన సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీన సాయంత్రం వరకు మోదీ మెడిటేషన్ చేయనున్నారు. దాదాపు రెండు రోజుల పాటు ప్రధానమంత్రి ధ్యాన మండపంలోనే మెడిటేషన్ చేస్తూ గడపనున్నారు.

పార్వతీదేవి- గౌతమ బుద్ధుడు- వివేకానందుడు
భగవాన్ శివుని కోసం ఎదురుచూస్తూ పార్వతీ దేవి ఒకే పాదంపై కన్యాకుమారిలో ధ్యానం చేశారని పురాణాలు చెబుతున్నాయి. గౌతమ బుద్ధుని జీవితంలో సారనాథ్‌ స్థూపానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో, స్వామి వివేకానందుడి జీవితంలో కన్యాకుమారి రాక్ మెమోరియల్‌‌‌కు అంతటి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ధ్యానం చేసిన తర్వాతే స్వామి వివేకానందుడికి తన కర్తవ్యం బోధపడిందని చెబుతారు. భారత దేశ నిర్మాణం కోసం ఏం చేయాలనేది అక్కడే ఆయన నిర్ణయించుకున్నారని అంటారు. అందుకే ఈసారి మెడిటేషన్ చేయడానికి స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌ను ప్రధాని మోదీ ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.

మన దేశంలో ప్రత్యేక స్థానం
కన్యాకుమారికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది భారతదేశపు దక్షిణపు కొన. మన దేశంలోని తూర్పు, పశ్చిమ సముద్ర తీర ప్రాంతాలు కలిసే ప్రదేశం కన్యాకుమారి. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం జలాలు కన్యాకుమారి వద్ద సంగమిస్తాయి. ఈ అద్భుత సీన్‌ను చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు కన్యాకుమారికి వస్తుంటారు. రెండు రోజులు కన్యాకుమారిలో ధ్యానం చేయడం ద్వారా ప్రధాని మోదీ దేశ సమైక్యతను చాటి చెప్పాలని భావిస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల టైంలో ప్రధాని మోడీ కేదార్‌నాథ్‌ గుహలో ధ్యానం చేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. అంతకుముందు 2014 ఎన్నికల టైంలో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను మోడీ సందర్శించారు. కాగా, దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న మొదలైన ఎన్నికల ప్రక్రియ జూన్ 1 తుది విడత పోలింగ్‌తో ముగియనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details