Naxalites at Polling Booth In Chhattisgarh : సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు కలకలం రేపారు. లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని సుక్మాలోని పోలింగ్ బూత్ గోడలపై రాశారు నక్సలైట్లు. బస్తర్ లోక్ సభ స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నక్సలైట్లు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి.
ఇంతకుముందు లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని గ్రామాల్లో, రోడ్డు పక్కన నక్సలైట్లు విసిరిన కరపత్రాలు కనిపించేవి. కానీ ఈ సారి ఏకంగా పోలింగ్ బూత్‌కు చేరుకుని ఎన్నికల బహిష్కరించాలని ఓటర్లను హెచ్చరించారు. సుక్మా జిల్లాలోని కెర్లపెడలోని పోలింగ్ స్టేషన్‌లో మంగళవారం నక్సలైట్లు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. 'ఈ పోలింగ్ బూత్‌లో ప్రజలెవరూ ఓటు వేయరు. నాయకులను ఎవరి కోసం ఎన్నుకోవాలి? నాయకులు ప్రజలను మోసం చేస్తారు' అని రాశారు.
కట్టుదిట్టమైన భద్రత
బస్తర్ ఎంపీ స్థానానికి మొదటి దశలోనే ఎన్నికలు నిర్వహించనుంది భారత ఎన్నికల సంఘం. సమస్యాత్మక ప్రాంతం కావడం వల్ల ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడతలో బస్తర్ స్థానానికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బస్తర్‌లో ఓటింగ్ జరగనుంది. కెర్లపెడ పోలింగ్ బూత్‌లో 791 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 446 మంది మహిళా, 345 మంది పురుష ఓటర్లు ఉన్నారు.