Arvind Kejriwal Ki Guarantee :లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మోదీ గ్యారంటీలకు కౌంటర్‌గా కేజ్రీవాల్ గ్యారంటీలు ప్రకటించింది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చైనా ఆక్రమణలో భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవటం సహా 10 గ్యారంటీలను అమలు చేయనున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి దిల్లీలో మీడియా సమావేశం నిర్వహంచిన కేజ్రీవాల్ మోదీ గ్యారంటీలు కావాలా లేక కేజ్రీవాల్ గ్యారంటీలు కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు.
అయితే తాము ప్రకటించిన గ్యారంటీలపై భాగస్వామ్య పక్షాలతో చర్చించలేదన్న కేజ్రీవాల్, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలుచేసేందుకు ఒత్తిడి చేయనున్నట్లు తెలిపారు కేజ్రీవాల్. ఉచిత విద్యుత్తు, నాణ్యమైన విద్య, మొహల్లా క్లినిక్‌ల ఏర్పాటు వంటి గ్యారంటీలను దిల్లీలో అమలు చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్తు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యంతోపాటు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్ పథకం రద్దుతోపాటు స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించనున్నట్లు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
"దేశవ్యాప్తంగా 24 గంటలు విద్యుత్ ఇస్తాం. ఎలా ఇస్తామంటే దేశంలో 3లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. వేసవికాలంలో అత్యధిక డిమాండ్ 2లక్షల మెగావాట్లు మాత్రమే. డిమాండ్ కంటే ఎక్కువ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయినా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. అందుకు నిర్వహణ లోపమే కారణం. విద్యుత్ ఉన్నప్పటికీ దిల్లీ, పంజాబ్‌లో ఇలాంటి పరిస్థితులే ఉండేవి. నిర్వహణ లోపాలను సరిదిద్ది దిల్లీ, పంజాబ్‌లో 24గంటలూ విద్యుత్ ఇస్తున్నాం. దేశంలో కూడా చేసి చూపిస్తాం. ఎందుకంటే మాకు ఆ అనుభవం ఉంది. దేశంలోని పేదలకు ఉచిత విద్యుత్ ఇస్తాం. దిల్లీ, పంజాబ్‌లో చేసి చూపించాం. దేశంలో కూడా చేసి చూపించగలం. అందుకు లక్షా 23వేల కోట్లు అవుతుందని లెక్కవేశాం. నేను గాలిమాటలు చెప్పటం లేదు. కేజ్రీవాల్ గ్యారంటీ అంటే మార్కెట్లో ఒక బ్రాండ్. మేం ఒక మాట చెబితే పూర్తి చేసి చూపుతాం"
-- అరవింద్ కేజ్రీవాల్ దిల్లీ ముఖ్యమంత్రి