DRDO On Stealth Aircraft: వైమానిక దళంలో అతికొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధవిమానాలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేస్తోంది. 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను డీఆర్‌డీఓ 'ఏవియేషన్ ఎక్స్‌పో ఐడాక్స్ 2024'లో ప్రదర్శించింది. ప్రపంచంలో అతి కొద్ది దేశాలకే పూర్తి స్థాయి స్టెల్త్ పైటర్ల సాంకేతికత పరిమితమైంది. అతి త్వరలో భారత్ ఆ దేశాల సరసన చేరనుంది.
భారత్ వైమానిక దళాన్ని అజేయ శక్తిగా మార్చనున్న స్టెల్త్ యుద్ధ విమానాల సాంకేతిక అభివృద్ధి దేశానికి గర్వ కారణమని ఈ సందర్భంగా డీఆర్‌డీఓ ఛైర్మన్ సమీర్ వి కామత్ తెలిపారు. భారత వైమానిక దళంలో ఇప్పటివరకు స్టెల్త్ రకం యుద్ధవిమానాలు, అభివృద్ధి సాంకేతికతలు లేవు. ప్రపంచంలో అతికొద్ది దేశాల దగ్గరే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో అత్యాధునిక 5.5 జనరేషన్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను(ఏఎమ్సీఏ) డీఆర్‌డీఓ డిజైన్ చేసింది. అభివృద్ధి దశలో ఉన్న ఈ ఏఎమ్సీఏ 2034లోగా డెవలప్‌మెంట్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకోనుంది. వైమానిక దళంలో 2035లో ప్రవేశపెట్టేలా ప్రణాళికలు చేసినట్లు డీఆర్‌డీఓ తెలిపింది.
వైమానిక విన్యాసాలు
తమిళనాడులోని సూలూరులో తరంగ్‌శక్తి పేరిట వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాలకు అనేక దేశాల రక్షణరంగ నిపుణులు హాజరయ్యారు. ఇందులో భాగంగా 'డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్‌పో ఐడాక్స్ 2024' ప్రదర్శనను నిర్వహించారు. ఇందులో డీఆర్‌డీఓ దేశీయంగా అభివృద్ధి చేసిన 40కి పైగా అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించింది.