Congress Working Committee Meeting :లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు నియంతృత్వ, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు తగిన సమాధానం చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి పార్లమెంట్ లోపల, బయట సమష్ఠిగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా 365 రోజులు ప్రజల మధ్యనే ఉంటుందని, వారి సమస్యలను లేవనెత్తుతుందని తెలిపారు. దిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
"కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో విధానసభ ఎన్నికల్లో చూపిన పనితీరు లోక్‌సభ పోరులో పునరావృతం చేయలేకపోయింది. అలాంటి రాష్ట్రాల్లో ఫలితాలపై విశ్లేషణ చేసుకుంటాం. భారత్ జోడో యాత్ర జరిగిన చోట కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం, సీట్లు పెరిగాయి. మణిపుర్‌లోని రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. నాగాలాండ్, అసోం, మేఘాలయలో సీట్లు గెలిచింది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించాం. దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఓటర్ల ప్రాబల్యం ఉన్న సీట్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ సీట్లు సాధించాం. మున్ముందు పట్టణ ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నాం. ఇండియా కూటమి ఐక్యంగా, క్రమశిక్షణతో ఉండాలి. ప్రజలు ఇండియా కూటమిపై విశ్వాసం ఉంచారు."
--మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ - సీడబ్యూసీ తీర్మానం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా నియమించాలని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి(CWC) తీర్మానం చేసింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఓ తీర్మానం ఆమోదించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. పార్టీ అభ్యర్థుల తరఫున రాహుల్‌గాంధీ చేసిన ప్రచారాన్ని కూడా సీడబ్ల్యూసీ ప్రశంసించినట్లు ఆయన చెప్పారు.
రాహుల్ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉండాలని సీడబ్ల్యూసీ కోరిక అని సమావేశం తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కుమారి సెల్జా తెలిపారు. రాహుల్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని దేశం మొత్తం కోరుకుంటోందని కాంగ్రెస్ నేత పార్టప్ సింగ్ బజ్వా తెలిపారు. అలాగే రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉండడంపై తుది నిర్ణయం ఆయనదేనని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ పేర్కొన్నారు. రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉండాలనేది 140 కోట్ల మంది భారతీయుల డిమాండ్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు, ప్రధాని మోదీకి పార్లమెంట్లో సమాధానం చెప్పగల వ్యక్తి రాహుల్ గాంధీ అని, అందుకే ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ సుఖ్వీందర్ సింద్ రంధావా అభిప్రాయపడ్డారు.
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) దిల్లీలోని అశోకా హోటల్లో సమావేశమైంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.