Arvind Kejriwal On BJP :దేశం వెంట దేవుడు ఉన్నారని, బీజేపీ అధర్మం అంతమై ధర్మం గెలుస్తుందని దిల్లీ సీఎం కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. జనవరి 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాన్ని కొట్టివేసి ఆప్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను సుప్రీంకోర్టు విజేతగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బుధవారం దిల్లీ శాసనసభలో మాట్లాడిన కేజ్రీవాల్ భగవద్గీతను కోట్ చేస్తూ బీజేపీ అధర్మాన్ని అంతం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నారని అన్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక తీర్పునకు సంబంధించి సుప్రీంకోర్టుకు, సీజేఐకి కృతజ్ఞతలు తెలిపారు. సీజేఐ ద్వారా దేవుడు మాట్లాడినట్లు ఉందని దిల్లీ సీఎం అన్నారు. మరోవైపు రైతుల ఆందోళనకు సంబంధించి కూడా బీజేపీపై విమర్శలు చేసిన కేజ్రీవాల్ వారు దిల్లీ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
'గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుంది'
'జనవరి 30 ఎన్నిక ఫలితాన్ని పక్కనపెడుతూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుంది. ఎమ్మెల్యేలకు ఎరవేయడం, ప్రభుత్వాలను బహిరంగంగా కూల్చివేసే ప్రయత్నాలకు ఆ పార్టీ పాల్పడుతోంది’ అని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆ పార్టీ ఎటువంటి ప్రయత్నాలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు