లోక కల్యాణార్థం పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే ఫిబ్రవరి 26న మొదలవుతాయి. మార్చి 3న ఎదుర్కోలు, 4న తిరుకల్యాణం, 5న రథోత్సవం నిర్వహిస్తారు.
ఈసారి కూడా బాలాలయంలోనే
ఆలయ పునర్నిర్మాణాల వల్ల ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన బాలాలయంలోనే... ఈసారి కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. రాబోయే ఉత్సవాలకు ప్రధానాలయాన్ని ప్రారంభించి మహాకుంభాభిషేకంతో పాటు సుదర్శన మహాయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి అభిలషించారు. పన్నెండు సార్లు పర్యటించి కొండపై పనుల్ని పరిశీలించి... వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే అప్పటికల్లా పనులన్నీ పూర్తయ్యే అవకాశం కనిపించకపోవడంతో... ఈసారి కూడా బాలాలయంలో జరపాలని నిర్ణయించినట్లు అర్థమవుతోంది.
వారం పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు
ప్రధానాలయ ఉత్సవాలే కాకుండా... అనుబంధ గుళ్లల్లోనూ నిర్వహణకు యాదాద్రి దేవస్థానం దృష్టిసారించింది. ముందస్తుగా అంటే రెండు నెలలకు పూర్వమే ఏర్పాట్లలో నిమగ్నం కావాల్సి ఉంటుంది. యాదాద్రికి అనుబంధంగా పాతగుట్ట ఆలయ వార్షికోత్సవాలు, వాటికి ముందస్తుగా అధ్యయన వేడుకలు జరుగుతాయి. ఫిబ్రవరి 4 నుంచి 10 వరకు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను వారం పాటు నిర్వహిస్తారు.
6 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు
యాదాద్రిపై గల పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో... ఫిబ్రవరి 18 నుంచి 23 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు చేపడతారు. అనంతరం యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. పంచనారసింహుల క్షేత్రంలో జరిగే కల్యాణోత్సవం నాడు స్వామి అమ్మవార్లకు రెండు సార్లు వివాహ వేడుక నిర్వహిస్తారు. ఉదయం బాలాలయంలో... రాత్రికి కొండ కింద కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ప్రముఖులకు మాత్రమే
బాలాలయంలో జరిగే వేడుకల్లో ఆలయ సిబ్బంది, అధికారులు, ఇతర ముఖ్యులు మాత్రమే పాల్గొంటారు. రాత్రి కొండ కింద చేపట్టే వేడుకలకు...వేలాదిగా భక్తజనం తరలివస్తారు.
ఇవీ చూడండి: మల్లారెడ్డి కళాశాలలో అత్యాచార ఘటనపై విద్యార్థుల ఆందోళన