రాష్ట్రానికే తలమానికంగా మారనున్న గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం హరితమయంగా ఉండే ఈ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక పార్కును యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని దండు మల్కాపురం వద్ద నిర్మిస్తున్నారు. ఉదయం 10 గంటలకు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. పనుల ప్రారంభోత్సవం అనంతరం పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశంకానున్నారు. .
ఇప్పటికే 371.06 ఎకరాల కేటాయింపు...
దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు కానున్న ఈ హరిత పారిశ్రామిక పార్కుకు మొత్తం 1,246 ఎకరాలు అవసరం ఉంది. తొలి విడతలో 371.06 ఎకరాల భూమిని సేకరించి... ఎకరానికి 11 లక్షల 60 వేల చొప్పున పరిహారం చెల్లించారు. రెండో విడతలో రైతుల నుంచి 580 ఎకరాలు తీసుకున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఈ పార్కు నిర్మాణం జరుగుతోంది. రహదారి నుంచి పార్కు వరకు 15 కిలోమీటర్ల మేర అంతర్గత రహదారులను నిర్మిస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్తు సౌకర్యానికి గానూ ప్రభుత్వం ఇప్పటికే రూ.36 కోట్లు కేటాయించింది. పార్కు లోపల 4 వరుసల అంతర్గత రహదారులు ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటున్నాయి. పారిశ్రామిక పార్కులో ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రం కూడా ఉండనుంది.
450 కంపెనీలు... 30 వేల ఉద్యోగాలు
రూ.1,550 కోట్లతో 450 కంపెనీల్ని తీసుకురావాలన్నది లక్ష్యం కాగా... 30 వేల మంది ఉద్యోగులు ఒకేచోట ఉండటానికి వీలుగా 194 ఎకరాల్లో టౌన్ షిప్ నిర్మిస్తారు. మరో 25 ఎకరాల్లో పాఠశాల, అంగన్‌వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆట స్థలం, తపాలా, అగ్నిమాపక కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో 20 శాతం భూమిని పచ్చదనానికి కేటాయిస్తున్నారు.
ఇవీ చూడండి : గ్రాట్యుటీ అర్హత ఐదేళ్ల నుంచి ఏడాదికి కుదింపు?