యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ శివారులో చోటుచేసుకున్న ముగ్గురు బాలికల పాశవిక హత్యాచారం కేసుల్లో దోషిగా తేలిని శ్రీనివాస్ రెడ్డికి మరణ శిక్ష పడింది. గతేడాది మార్చి 8న ఒక బాలిక... ఏప్రిల్ 25న ఓ అమ్మాయి... 2015లో మరో విద్యార్థిని అదృశ్యమయ్యారు. 2019 ఏప్రిల్ 26న ఒకరి మృతదేహం బయటపడింది. నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదే రోజు అదుపులోకి తీసుకున్నారు.
పాడుబడ్డ బావిలో మూడు మృతదేహాలు
పోలీసుల విచారణలో భాగంగా... హజీపూర్ శివారులోని పాడుబడ్డ బావిలో... ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. మైనర్లు అయినందున పొక్సో చట్టం కింద కేసులు నమోదు చేసిన భువనగిరి పోలీసులు... దర్యాప్తు నిర్వహించారు. నల్గొండ మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలోని పొక్సో చట్టం కోర్టులో... మూడున్నర నెలలపాటు విచారణ సాగింది.
ఉరి వేయాల్సిందే...!
కోర్టు ట్రయల్స్.. గతేడాది అక్టోబరు 19న ప్రారంభమై... డిసెంబర్ 13 నాటికి ముగిశాయి. డిసెంబరు 6,8 తేదీల్లో ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించగా... 8, 17 తేదీల్లో డిఫెన్స్ వాదనలు పూర్తయ్యాయి. పోలీసులు సేకరించిన ఆధారాలు, 101 మంది సాక్షుల వాంగ్మూలాలను.. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. చంద్రశేఖర్ న్యాయస్థానానికి సమర్పించి ఉరిశిక్ష విధించాలని వాదించారు.
ఇప్పటి వరకు ఒక్కటే..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ఒక కేసులో మాత్రమే మరణశిక్ష పడింది. ఓ హత్య కేసులో నిందితుడికి... 1987లో అప్పటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రూపేంద్ర ప్రసాద్ సెహ్వాల్ ఉరిశిక్ష విధించారు. ఈ కేసులో ఏ శిక్ష పడుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. హాజీపూర్ గ్రామస్థులతో పాటు తీర్పు వినేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చదవగానే.. వారంతా హర్షం వ్యక్తం చేశారు. అటు హత్యలు జరిగిన హాజీపూర్ గ్రామంలో స్థానికులు ఆనందంలో మునిగారు. నిందితునికి సరైన శిక్ష పడిందని సంబరాలు జరుపుకున్నారు.