యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన గట్టు లక్ష్మమ్మది నిరుపేద కుటుంబం. ఆమె భర్త చెన్నయ్య 16 ఏళ్ల క్రితం మృతి చెందాడు. భర్త మరణం తర్వాత తనకున్న పూరి గుడిసెలో జీవనం సాగిస్తూ కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను పోషించేది. కూతురికి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించింది. మూడు నెలల క్రితం ఈదురుగాలులు, వర్షాలకు లక్ష్మమ్మ పూరి గుడిసె నేలమట్టమైంది. తన గూడు చెదిరిపోవడంతో లక్ష్మమ్మకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
మరుగుదొడ్డిలో జీవనం
కొద్దిరోజులు ఆరుబయట వండుకొని తింటూ చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలో నిద్రించేది. మరికొద్ది రోజులు కూతురు వద్ద ఉంది. ప్రస్తుతం లక్ష్మమ్మ స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా నిర్మించిన మరుగుదొడ్డిలో జీవనం సాగిస్తోంది. వర్షాలు లేనపుడు ఆరుబయట వంట చేసుకుంటుంది. వర్షాలు పడిన సమయాల్లో చాలా కష్టం అవుతోందని లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తంచేస్తోంది.
చేయూతనిస్తే...
రేషన్ సరుకులు, ఆసరా పింఛన్ కోసమైనా లక్ష్మమ్మ ఊర్లో ఉండాల్సిన పరిస్థితి. మోత్కూర్లో ఉంటున్న తన కూతురుకు భారం కాకూడదని దుబ్బాకలోనే ఉంటుంది లక్ష్మమ్మ. వృద్ధాప్యం రావడంతో కూలిపనులకు వెళ్లడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్, తన కూతురు పంపించే డబ్బులతో కాలం గడుపుతోంది. తనకు గూడు కట్టివ్వాలని దీనంగా వేడుకుంటోంది.
ఇదీ చూడండి: 'మహా' పాలనపై శివసేన అధినేతతో అమిత్షా భేటీ!