వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీ పరిసరాలు.. ప్రేమోన్మాది దాడిలో హతురాలైన బాధిత కుటుంబసభ్యుల రోదనలతో మారుమోగింది. యువతి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి... శనివారం ఉదయం శవపంచనామా నిర్వహించారు. నిన్నటివరకూ తమ కళ్ల ముందున్న కన్న కూతురు... మార్చురీలో బల్లపై శవమై కనిపించడం చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు.
అక్క అని పిలుస్తూనే..
కిరాతకంగా తమ అమ్మాయిని నిందితుడు షాహిద్ పొట్టనపెట్టుకున్నాడంటూ... కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్క అంటూ తిరుగుతూ షాహిద్ తన కుమార్తెను నమ్మించి గొంతుకోశాడని తండ్రి విలపించాడు. మరొకరికి అన్యాయం జరగకుండా ఉండాలంటే.. వెంటనే షాహిద్‌ను చంపేయాలని డిమాండ్ చేశారు.
మరో వ్యక్తితో పరిచయం పెంచుకుని చాటింగ్ చేస్తోందన్న అనుమానంతోనే షాహిద్.. ఆ యువతిని అత్యాచారం చేసి దారుణంగా గొంతుకోసి చంపాడని పోలీసులు వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పక్కాగా ఆధారాలు సేకరించి... నిందితుడిని కోర్టు ముందు హాజరుపరుచుతామని తెలిపారు.
అంతకుముందు మంత్రి సత్యవతీ రాఠోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్ ఎంజీఎంకు వచ్చి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. తనకు కడుపుకోత మిగిల్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి తల్లి మంత్రికి విజ్ఞప్తి చేశారు.
బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సత్యవతి రాఠోడ్ హామి ఇచ్చారు. మహిళల భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదని... ఇలాంటివి పునరావృతం కాకుండా సమాజంలో మార్పు రావాలని సత్యవతి రాఠోడ్, వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
మృతదేహాన్ని ఇంటికి తరలించే క్రమంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని తరలించేది లేదని భాజాపా నాయకులు.. కొంత సేపు ఆందోళన చేశారు. ఎమ్మార్పీస్ నాయకులు కూడా జత కలిశారు. తమకు న్యాయం కావాలంటూ.. మారుమోగుతున్న నినాదాల నడుమ యువతి మృతదేహాన్ని ఆమె స్వగృహానికి తరిలించారు.
ఇవీ చూడండి: ఆ ఫొటోలు కుటుంబ సభ్యులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్