విద్యార్థుల బస్ పాసుల్లో అక్రమాలకు పాల్పడుతూ... ఆర్టీసీ సొమ్మును గుట్టు చప్పుడు కాకుండా కొల్లగొడుతున్న వైనం వరంగల్ ఆర్టీసీ రీజియన్లో వెలుగు చూసింది. అవకతవకలకు సంబంధించి ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు విచారణ జరుపగా పాసుల గోల్మాల్ వ్యవహారం బయటపడింది.
బస్పాసులే సీజనల్ పాసులు అయి..
బస్ పాసుల జారీని నెటెక్సల్ అనే సంస్థకు ఆర్టీసీ అప్పగించగా... ఈ సంస్థ సిబ్బంది విద్యార్థుల బస్పాస్లను నెలవారీ రెన్యువల్ చేస్తారు. అయితే ప్రతీ నెల పాసులు రెన్యువల్ చేయించని విద్యార్థుల వివరాలను కొంతమంది సిబ్బంది సేకరించి... వారి స్థానంలో ఉద్యోగులు, ఇతరుల సీజనల్ బస్ పాసులు తీసుకునే వారికి ఇచ్చేస్తున్నారు. ఆన్లైన్లో విద్యార్థికి జారీ చేసినట్లు ఉంటే కార్డులో మాత్రం సీజన్ బస్పాసు దారుడి ఫోటో.. ధర ఉంటుంది. కాబట్టి ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. 150 రూపాయల విద్యార్థుల బస్పాస్ ధర ఉంటే.. సీజనల్ పాసుల ధరలు దూరాన్ని బట్టి పదిహేను వందలు, రెండు వేల వరకూ ఉంటుంది. ఆర్టీసీకి మాత్రం కేవలం 150 రూపాయలు మాత్రమే చెల్లించి... మిగతా డబ్బులు సిబ్బంది నొక్కేశారు.
ఒప్పందమే కొంపముచ్చేలా ఉంది..
పాసులు జారీని 2017 నుంచి నెట్ఎక్సెల్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. 2020 జులై వరకు పాసుల జారీకి ఈ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. రీజియన్ల వారీగా డిపోల పరిధిలో కౌంటర్లను ఏర్పాటు చేసి ఈ సంస్థ బస్ పాసులను జారీ చేస్తుంది. ఒక్కోపాస్కు రూ. 30 చొప్పున తీసుకుంటారు. వరంగల్ ఒకటో డిపోకు సంబంధించి ఆన్లైన్ బస్ పాసులు జారీ చేసే కేంద్రం హన్మకొండ బస్ స్టేషన్లో ఉండగా... ఇందులో పని చేస్తున్న రాకేష్, శ్రీకాంత్ అనే ఇద్దరు సిబ్బంది ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయా..?
పోలీసుల విచారణలో ఈ గోల్మాల్ వెనుక మరికొందరు కూడా ఉన్నట్లు తెలియడం వల్ల అధికారులు మొత్తం అన్ని డిపోల పరిధిల్లోనూ బస్ పాసుల జారీలో అవకతవకలు జరిగాయా అన్నదీ విచారిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పాసుల డబ్బుల గోల్మాల్పై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్ పాసులు జారీ చేస్తుంది నెట్ఎక్సెల్ సంస్థ సిబ్బందే అయినందున ఈ తరహా అక్రమాలకు అవకాశం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఈ తరహా మోసాలు మరింత నష్టాల పాలుచేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆర్టీసీ అధికారులు సమగ్ర విచారణ జరిపితేనే... వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
ఇదీ చూడండి: సరకు రవాణాకు.. సిద్ధం కాబోతున్న ఆర్టీసీ బస్సులు