వికారాబాద్ జిల్లా అంగలూరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఇద్దరిని బలిగొంది. నిన్న అర్ధరాత్రి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
అసలేం జరిగింది?
చెంగేస్పూర్కు చెందిన అంజమ్మతో నరసింహులు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నిన్న రాత్రి అంజమ్మ ఇంటికి వెళ్లిన నరసింహులు ఉదయానికి విగత జీవిగా మారాడు. అర్ధరాత్రి సమయంలో ఏం జరిగిందో తెలియదని... అంజమ్మ తరఫు వారే నరసింహులను తగలబెట్టారని మృతుడి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.
దర్యాప్తులోనే తేలాలి
నిన్న రాత్రి సమయంలో నరసింహులు తమ ఇంటికి వచ్చాడని... అదే సమయంలో తమ తల్లిదండ్రులు వారిని చూడడం వల్ల తమ చెల్లిపై పెట్రోల్‌పోసి నిప్పుపెట్టాడని... అడ్డు వచ్చిన తమ తల్లి దండ్రులకు కూడా గాయాలయ్యాయని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.
వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం విషయం ఇరు కుటుంబాల్లో తెలిసినప్పటికీ వీరి తీరు మారలేదని... గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా మార్పు రాలేదని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
ఇదీ చూడండి: మహిళతో సంబంధం... కొట్టి చంపిన ఆమె కుటుంబ సభ్యులు