త్యాగాలతో కూడిన ఎన్నో ప్రేమ కథలు మనం విన్నాం..చూశాం... ప్రియురాలి కోసం తాజ్‌మహాల్‌ను నిర్మించి తన గుండెల్లోని ప్రేమను చాటుకున్న షాజహాన్... ఇప్పటికీ ఎందరో ప్రేమికులకు ఆదర్శం. మరీ అంతలా కాకపోయినా... అదే తరహాలో వికారాబాద్‌కు చెందిన ఓ యువకుడు ప్రియురాలిని దక్కించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. తన ప్రేమను నిలబెట్టుకునేందుకు దేశ రాజధానిలో 8 నెలల కఠోర శిక్షణ తీసుకుని ఇస్లాం మతం స్వీకరించాడు. ప్రియురాలి తల్లిదండ్రుల ఆదేశంతో ఖురాన్‌ను ఆపోసన పట్టాడు.
ప్రేమకోసం మతం మార్పిడి:
ఇతని పేరు మహ్మద్ అబ్దుల్ హునైన్. వికారాబాద్కి చెందిన ఇతని అసలు పేరు బొబ్బిలి భాస్కర్. డిగ్రీ చదువుకున్న ఇతడు స్థానికంగా ఓ కుటీర పరిశ్రమ నడుపుతున్నాడు. బాల్యం నుంచి ఒకే పాఠశాలలో చదువుకోవడం వల్ల ఓ ముస్లిం బాలికతో స్నేహం ఏర్పడి... ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తనే జీవిత భాగస్వామి అని నిర్ణయించుకున్నాడు. అయితే వీరి పెళ్ళికి మతం అడ్డు వస్తోందని చెప్పారు. యువతి తల్లిదండ్రులు. మొదట్లో ఒప్పుకోకపోయినా ఇస్లాంలోకి మారితే పెళ్ళి చేస్తామని హామీ ఇవ్వడంతో... మతం మారి తన ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం దిల్లీకి వెళ్లి ఇస్లాం మత స్వీకరణ కోసం 8 నెలల పాటు శిక్షణ పొందాడు. ఆ తర్వాత తాండూరులోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ముస్లింగా మారినట్లు మత ధ్రువీకరణ పత్రాన్ని కూడా పొందాడు.
ప్రేమ కోసం దేశ రాజధానికి పయనం
ప్రియురాలితో అందమైన జీవితాన్ని ఊహించుకొని వికారాబాద్కి తిరిగి వచ్చాడు యువకుడు. 'బొబ్బిలి భాస్కర్ అనే నేను మహ్మద్ అబ్దుల్ హునైన్‌గా మారానని, ఈ పేరు కూడా ప్రియురాలే సూచించింది' అని చెబుతున్నాడు. కుమారుడి ప్రేమను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు అతడికి అండగా నిలిచారు. అమ్మ అంగీకారంతో ప్రేమ కోసం దేశ రాజధానికి పయనమయ్యాడు. శిక్షణ కష్టమైనా ప్రేయసి కోసం భరించాడు. ఊరిలో హేళన చేస్తున్నా పట్టించుకోలేదు. తిరిగొచ్చిన వెంటనే ప్రియురాలి తల్లిదండ్రులను కలిసి పెళ్ళి విషయమై చర్చించాడు. వారి వైఖరిలో మార్పు చూసి ఖంగుతిన్నాడు.
రక్షణ కల్పించాలి:
నేటి సమాజంలోని యువత ప్రేమలపై నమ్మకం పోతోన్న ఈ రోజుల్లో... ఓ యువకుడు తన ప్రేయసి కోసం ఏకంగా మతాన్నే మార్చుకోవడం సాహసమనే చెప్పాలి. మత మార్పిడి కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని... పెళ్ళికి అంతా సిద్ధం చేసుకుని ఇంటికి వచ్చాడు. గతంలో ఇస్లాంలోకి మారితే వివాహం చేస్తామన్న ఆమె తల్లిదండ్రులు... ఇప్పుడు ఆ యువకుడిని చూసి నువ్వు ఎవరో మాకు తెలియదు అని బదులివ్వడంతో నిర్ఘాంతపోయాడు. ఇద్దరికీ కలుసుకునే అవకాశం లేకుండా చేసి... అమ్మాయిని బంధువుల దగ్గర నిర్బంధించారు. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా రోజూ తన కోసం తిరుగతూ... ఆరా తీస్తుండటంతో విసిగిపోయిన యువతి కుటుంబ సభ్యులు అతడిని చితకబాదారు. ఈ ఘటనతో ఏం చేయాలో పాలుపోక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. తన గోడు వెళ్లబోసుకొని... న్యాయం చేయాలని అర్థిస్తున్నాడు. తాను ప్రేమించిన యువతితో వివాహం జరిపించేలా చర్యలు తీసుకోవాలని... తామిద్దరికి ప్రాణ రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని వేడుకున్నాడు ఈ అమర ప్రేమికుడు.
ప్రియురాలి కోసం మతం మారిన భాస్కర్‌కి ప్రేమ దక్కుతుందా...? ప్రేమ కోసం ఇస్లాం స్వీకరించిన హునైన్ తన ప్రేయసిని పొందుతాడా...? మానవ హక్కుల సంఘం ద్వారా వాళ్లిద్దరూ ఈ ప్రేమ జంట ఒక్కటవుతుందా...? అనేది వేచి చూడాల్సిందే.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: తెలంగాణ ఓటర్లలో పోటెత్తిన చైతన్యం