గుప్త నిధుల వేట
ఆలయంలో గుప్త నిధులున్నాయని... విద్రోహ శక్తులు ఆలయంలో తవ్వకాలు జరిపారు. శివలింగాన్ని సైతం నామరూపాలు లేకుండా పెకలించి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్థాయిలో పలు దఫాలు కమిటీలు వేసిన ముందడుగు పడలేదు.
ఆక్రమణలో దేవుడి మాన్యం
సారంగేశ్వర దేవాలయానికి నడిగూడెం, బృందావనపురం, కలకోవ, జగన్నాధపురం గ్రామాల్లో 20 ఎకరాల భూములు ఉన్నాయి. నడిగూడెం మండల కేంద్రంలో 6.5 ఎకరాల భూములు మినహా మిగతావన్నీ ఆక్రమణకు గురయ్యాయి. ఏళ్ల తరబడిగా దేవుడు భూములు సాగు చేసుకుంటున్నా... ఎలాంటి కౌలు చెల్లించడం లేదు. అటు దేవాదాయ శాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడం శోచనీయం.
నిధులు మంజూరైనా
జీర్ణ దేవాలయ పునరుద్ధరణ పథకం కింద ఆలయ పునర్నిర్మాణానికి సంవత్సరం క్రితం 54 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కొత్తగా వేరే ప్రాంతంలో స్థలాన్ని సేకరించి నిర్మించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. పాత స్థలంలోనే నిర్మించాలని కొందరు అడ్డుచెప్పారు. దీంతో ఆలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మళ్లీ దాని గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఆలస్యమైతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదముందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
వందల ఏళ్ల చరిత్ర ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని ప్రభుత్వం పునర్నిర్మించి, పూర్వ వైభవం తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. శివరాత్రి, దసరా ఉత్సవాలు తిరిగి ఆలయంలో నిర్వహించుకోవాలని ఆశిస్తున్నారు.