హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సుర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. 3 రోజుల క్రితం రెండు కార్లలో 16 మంది ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థులు విహారయాత్రకు బయలుదేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని బాపట్ల, తెనాలి బీచ్ సందర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేసి ప్రయాణమయ్యారు.
ముగ్గురు అక్కడికక్కడే మృతి...
సుర్యాపేట జిల్లా మునగాల సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఫల్టీలు కొట్టిన కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో హర్ష, రేవంత్ , శశాంక్ అనే విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రణీత్, ఆసీఫ్, అజయ్, నిఖిల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈశ్వర్ అనే యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులందరినీ సూర్యాపేట జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: ప్రమాదవశాత్తు ఎగిసిపడిన మంటలు.. హోటల్ దగ్ధం