సిద్దిపేట జిల్లా ఉన్నతాధికారుల తీరు చర్చనీయాంశమైంది. అవినీతి ఆరోపణలతో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న అదనపు డీసీపీ గోవిందు నర్సింహారెడ్డిని వారు కలవడం విమర్శలకు తావిస్తోంది. సిద్దిపేట జిల్లాలో నర్సింహారెడ్డి మూడేళ్లుగా వివిధ హోదాల్లో పనిచేశారు. జిల్లాల ఆవిర్భావ సమయంలో సిద్దిపేట డీఎస్పీగా ఇక్కడకు వచ్చిన ఆయన కమిషనరేట్‌లో అదనపు డీసీపీగా పదోన్నతి పొందారు.
డిసెంబరు 18, 19 తేదీల్లో ఆయన క్యాంపు కార్యాలయంతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆయన బంధువులు, బినామీల ఇళ్లపై అనిశా అధికారులు దాడులు చేశారు. రూ.10 కోట్ల మేర అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. డిసెంబరు 19న అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చగా కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి నర్సింహారెడ్డి చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.
మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి, సంయుక్త కలెక్టర్ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, డీఎఫ్‌వో శ్రీధర్‌రావు, నీటి పారుదల శాఖ జిల్లా అధికారి రవీందర్‌రెడ్డి తదితరులు జైల్లో ఉన్న నర్సింహారెడ్డిని పరామర్శించారు. దాదాపు 15 నిమిషాల పాటు అక్కడ గడిపారు. ఈ విషయమై కలెక్టర్ వెంకటరామరెడ్డిని వివరణ కోరగా, తనతో పాటు మరో ఏడుగురు అధికారులు వెళ్లామని, చాలా కాలం గోవిందు నర్సింహారెడ్డితో కలిసి పని చేసిన కారణంతోనే ఆయనను పరామర్శించామని వివరించారు.
ఇదీ చూడండి: ఇదిగో... నువ్ మాత్రం జాగ్రత్త సుమీ..!