సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కి చెందిన రేణుక, రాజు భార్యాభర్తలు. మొదటి కాన్పులో వీరికి ఓ దివ్యాంగ పాప పుట్టింది. అప్పటి నుంచి భర్త తీరులో మార్పు వచ్చింది. రెండో కాన్పులో తనకు పండంటి మగ బిడ్డ కావాలని ఎప్పుడూ భార్య రేణుకకి చెప్తూ ఉండేవాడు. కానీ రెండో కాన్పులోనూ వారికి ఆడపిల్లే పుట్టింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని భర్త రాజు పాపని చూసేందు కు ఆస్పత్రికి కూడా వెళ్లలేదు.
డబ్బులియ్యయా.. కాళ్లు మొక్కుతా, పాపని ఆస్పత్రికి తీసుకెళ్లాలి
ఆస్పత్రికి రాకపోతే ఏంటి మా బిడ్డే... కదా పాపని కచ్చితంగా ఆదరిస్తాడని రేణుక అత్తింటికి చేరుకుంది. కానీ భర్త ఆ పాపని కనీసం చూడలేదు. దగ్గరకి కూడా తీయలేదు. పాప ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోలేదు. అదే ఆ పాప పాలిట శాపమైంది. పాప అనారోగ్యం బారిన పడింది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేని మహిళ భర్తని వేడుకుంది. అయినా ఆ కఠినాత్ముడి మనసు కరగలేదు. పాప ఏమైతే నాకేంటి అంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
తల్లి చేతుల్లోనే ప్రాణాలు విడిచిన పసికందు
దిక్కుతోచని స్థితిలో రేణుక తన తమ్ముడి దగ్గరకు వెళ్లింది. అతడి సాయంతో పాపని ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ అప్పటికే పాప ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. చివరకు ఈ రోజు పాప తల్లి చేతుల్లోనే మృతి చెందింది. తన పాప మృతికి భర్తే కారణమని.. ఆ దుర్మార్గుడికి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఓ చేతిలో దివ్యాంగ బాలికను మరో చేతిలో నెలరోజుల పసికందు మృతదేహాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కు చేరింది.
నా భర్తను కఠినంగా శిక్షించండి
పాప మృతికి తన భర్త రాజే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేణుక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని పాప మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: లైవ్: రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియా సమావేశం