అధికార పార్టీ వల్లే అభివృద్ధి...
అధికారంలో ఉన్న తామే అభివృద్ధి చేయగలమనే సందేశాన్ని ఓటర్లకు చేరవేసేలా తెరాస నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులు, చేసిన ఖర్చు తదితర వివరాలను ఓటర్లకు వివరించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు విజయం చేకూరుస్తాయని తెరాస నేతలు చెబుతున్నారు.
పూర్వవైభవం తెచ్చేలా జగ్గారెడ్డి కసరత్తు...
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కసరత్తు చేస్తున్నారు. సంగారెడ్డి పురపాలక చైర్మన్ అభ్యర్థిగా.. తన భార్య నిర్మలారెడ్డి పేరు ప్రకటించారు. సదాశివపేట పురపాలకంపైనా... ప్రత్యేక దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితుల్లో రెండు పట్టణాలు కైవసం చేసుకోని తన సత్తా మరోసారి చాటాలని జగ్గారెడ్డి ప్రయత్నిస్తున్నారు. సింగూరు జలాలను తరలించి... స్థానికంగా తాగునీటి కష్టాలకు తెరాస కారణమైందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రసన్నం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. రెండు పట్టణాల్లో మేయర్ పీఠాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ గెలిచినా... తెరాసదే పీఠం...
గత పురపాలక ఎన్నికల్లో సంగారెడ్డి, సదాశివపేట ప్రజలు కాంగ్రెస్‌కే మొగ్గు చూపారు. సదాశివపేటలో అనూహ్యంగా ఆ పార్టీ కౌన్సిలర్లు తెరాసలో చేరి అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలను దక్కించుకున్నారు. సంగారెడ్డిలో స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు సొంతం చేసుకున్నా... అనంతరం జరిగిన పరిణామాలతో వాళ్లిద్దరూ తెరాసలో చేరిపోయారు. ఈసారి ప్రజా తీర్పు.. నాయకుల కప్పదాట్లు ఏలా ఉంటాయో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.