పల్లెలను పరిశుభ్రంగా మార్చేందుకు సర్కారు 30రోజుల ప్రణాళికను రూపొందించింది. ప్రజలు అధికారులు సమష్టిగా కృషి చేసి.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రమదానంతో పల్లెల రూపురేఖలు మార్చేశారు. హరితహారంతోపాటు డంప్ యార్డ్, వైకుంఠధామాలు ఏర్పాటు చేసుకున్నారు.
మంత్రి హరీశ్‌రావు సూచనతో....
ఆర్థిక మంత్రి హరీశ్ రావు సూచనతో అధికారులు ట్రాక్టర్ల పంపిణీకి ప్రణాళిక రూపొందించారు. 2000లకు పైగా జనాభా ఉన్న గ్రామాలకు 42 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్, 2000 కంటే తక్కువ జనాభ ఉన్న పంచాయతీలకు 24 హెచ్‌పీ ట్రాక్టర్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. చెత్తను తరలించేందుకు ట్రాలీ, మొక్కలకు నీళ్లు పోయడానికి ట్యాంకర్, గ్రామంలో స్వచ్ఛభారత్ నిర్వహించేందుకు డోజర్ కూడా ఇంజన్‌తోపాటు అందివ్వనున్నారు. సంగారెడ్డి జిల్లాలో మహీంద్రా ట్రాక్టర్ తయారీ పరిశ్రమ ఉండటం వల్ల కలెక్టర్ హన్మంతరావు చొరవ తీసుకుని.. యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. తక్కువ ధరకే ట్రాక్టర్లు అందించేలా వారిని ఒప్పించారు.
డీసీసీబీ రూ.50 కోట్ల రుణం...
42హెచ్‌పీ ఇంజన్, ట్రాలీ, ట్యాంకర్, డోజరు కలిపి రూ.9లక్షల వ్యయం అవుతోంది. ఇందులో సగం గ్రామ పంచాయతీ నిధుల నుంచి చెల్లిస్తుండగా.. మిగిలిన సొమ్ము డీసీసీబీ బ్యాంకు నుంచి రుణం అందించనున్నారు. ట్రాక్టర్ల కొనుగోలు కోసం డీసీసీబీ సుమారు 50కోట్ల రూపాయలకు పైగా గ్రామపంచాయతీలకు రుణం రూపంలో అందిస్తోంది. ఈరోజు ఆర్థిక మంత్రి హరీష్ రావు.. ట్రాక్టర్లను ఆయా గ్రామ పంచాయతీలకు అందివ్వనున్నారు. వివిధ పనులకు ఉపయోగపడేలా.. ఈ యంత్ర పరికరాలు అందివ్వడం ద్వారా గ్రామ పంచాయతీలపై ఆర్థికభారం తగ్గనుంది.
సంగారెడ్డి జిల్లా స్ఫూర్తితో.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచయతీకి ట్రాక్టర్లు అందివ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన చేశారు.