కీర్తి అంటే యశస్సు, గొప్పతనం వంటి పదాలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు కీర్తి అంటే మునగనూరులో తల్లిని చంపేసి.. ఆ నేరాన్ని తండ్రిపై నెట్టిన ఓ అమ్మాయి మన కళ్లముందు మెదులుతోంది. పిల్లల మనసు అసలెందుకింత విషపూరితం అవుతోంది.
వినోదాన్ని పంచే రీతుల్లో వ్యత్యాసం...
నిన్న మొన్నటిదాకా చందమామ, బాలమిత్ర కథలు, సత్య హరిశ్చంద్ర, రామాయణ భారత కథలు వంటివి వినోదాన్నిచ్చే పాఠాలు, నైతిక సూత్రాలు. ఈ కాలంలో వినోదమంటే కుటుంబంలో ఒకరిపై మరొకరు విద్వేషాలు పెంచుకునే సీరియళ్లు, మనుషుల్ని చంపుకునే వీడియో గేమ్‌లు, క్రైమ్ న్యూస్‌లు. వీటిని ప్రోత్సహించి తెలియకుండానే పిల్లల మనసుల్లో విషం ఎక్కిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు.
ఈ సమస్యలకు పరిష్కారం తల్లితండ్రుల చేతుల్లోనే ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏం చూస్తున్నారు అనే అంశాలపై ఓ కన్నేయాలి.
ఏ విషయాలపై శ్రద్ధ పెట్టాలంటే...
- స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారో తెలుసుకోవాలి.
- మంచి పుస్తకాలను చదివించాలి.
- వారితో కొంత సమయం గడపుతూ స్నేహితుల్లా ఉండాలి.
- పిల్లలు లక్ష్యసాధన వైపు సాగిపోయేందుకు మంచిమార్గం చూపాలి.
- వారిచేత కచ్చితంగా చందమామ, బాలమిత్ర నీతి కథలు, సత్య హరిశ్చంద్ర, రామాయణ, మహాభారత కథలు చదవించి... అర్థం చేయించాలి.
- భారతదేశం కోసం ప్రాణాలర్పించిన వారి గాథలు చెబుతూ దాని నుంచి మనమేం నేర్చుకోగలమో వివరించాలి.
ఇలాంటివన్నీ పిల్లలకు నేర్పిస్తూ తల్లిదండ్రులు నేటితరం పిల్లల్లో కొత్త శకాన్ని రూపొందించవచ్చు. అలాంటి మంచిపనికి శుభతరుణాలను చూడక ఇవాళే మెదలు పెట్టండి మరి..!